● 24 గంటల వ్యవధిలోనే భార్య కూడా మృతి
నార్కట్‌పల్లి : భర్త మృతిని తట్టుకోలేక 24 గంటల వ్యవధిలోనే భార్య మృతిచెందింది. ఈ ఘటన సోమవారం నార్కట్‌పల్లి మండలం తొండల్‌వాయి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండల్‌వాయి గ్రామానికి చెందిన శనిగారపు బాలయ్య(80), చంద్రమ్మ(75) దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు అదే గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వృద్ధ దంపతులు కొడుకుల వద్ద ఉండకుండా వేరుగా ఒక గదిలో నివసిస్తున్నారు. కాగా.. బాలయ్య అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడు. అదే రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. బాలయ్య మృతిని తట్టుకోలేక అతడి భార్య చంద్రమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. సోమవారం ఉదయం చంద్రమ్మ ఎంతకూ నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు దగ్గరకు వెళ్లి చూడగా.. ఆమె కూడా మృతిచెందింది. భార్యాభర్తలు ఒక్కరోజు వ్యవధిలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


