మిర్యాలగూడ అర్బన్ : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన అయిటిపాముల సోమలింగం కుమారుడు అభినవ్(32) ఓ షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అభినవ్ సోమవారం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ సత్యనారాయణ పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆత్మహత్య
మర్రిగూడ(చింతపల్లి) : ఆర్థిక ఇబ్బందులతో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ పరిధిలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ ముత్యాల రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం గిరికొత్తపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ గరీబ్ ఖాజానవాబ్(45) చింతపల్లి మండలం గొడకొండ్ల గ్రామ పరిధిలోని వీటీ నగర్‌లో గల ది రెయిన్‌బో స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్(కరస్పాండెంట్)గా వ్యవహరిస్తున్నాడు. ఆయన గతంలో నారాయణపేట జిల్లా కోస్గిలో పాఠశాల నడిపి నష్టపోయాడు. దీంతో అప్పులు ఎక్కువ కావడం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మానసిక వేదనకు గురై సోమవారం ఉదయం పాఠశాలలోని గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపాల్ గమనించి ఖాజా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య షబానా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్టీసీ బస్సులో
బంగారు ఆభరణాలు చోరీ
కొండమల్లేపల్లి : ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఈ ఘటన సోమవారం కొండమల్లేపల్లి బస్టాండ్‌లో జరిగింది. వివరాలు.. మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సు దేవరకొండకు వెళ్తూ.. మార్గమధ్యలో కొండమల్లేపల్లి బస్టాండ్‌కు చేరుకుంది. కొండమల్లేపల్లికి చెందిన జక్క పుష్పలత, నాంపల్లి మండలం దేవత్‌పల్లికి చెందిన కుందారపు అనసూయ బస్సు ఎక్కుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరు మహిళల వద్ద హ్యాండ్‌బ్యాగ్‌లను తస్కరించారు. ఆ బ్యాగుల్లో ఆరు తులాల బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధిత మహిళలు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.


