భువనగిరిటౌన్ : ప్రతి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయురాలిని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్(బాలల పరిరక్షణ అధికారి)గా నామినేట్ చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు వెల్లడించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయినులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి వి.మాధవీ లతతో కలిసి పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు.జిల్లా వ్యాప్తంగా 180 మంది ఉపాధ్యాయినులు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బాధ్యతల్లో ఉన్నారని చెప్పారు. సదస్సులో సంస్థ కార్యదర్శి వి.మాధవీ లత బాలల చట్టాలు, పారా లీగల్ వలంటీర్ల వ్యవస్థ, న్యాయ సేవా సంస్థల విధులపై మాట్లాడారు. స్పెషల్ జడ్జి మిలింద్ కాంబ్లి పోక్సో చట్టం, ఉపాధ్యాయుల బాధ్యతలు, భువనగిరి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జి.స్వాతి బాల్యవివాహాల నిషేధ చట్టం, అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ షేక్ ఆరీఫ్ జువైనెల్ జస్టిస్ చట్టాన్ని వివరించారు. అలాగే, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి బాలల హక్కులు–సమస్యలపై, ఇన్‌చార్జ్ సిహెచ్.శ్రీనివాస్ బాధితులకు అందే నష్టపరిహారంపై, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ బండారు జయశ్రీ కమిటీ సేవలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి లింగారెడ్డితో పాటు జిల్లా వ్యాప్తంగా ఎన్నికై న చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఫ జిల్లా ప్రధాన న్యాయముర్తి జయరాజు


