యాదగిరిగుట్ట: పోలీసులు విధి నిర్వహణలో ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ సూచించారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీలక్ష్మీనరసింహ గార్డెన్స్‌లో చావా ఫౌండేషన్, ఆర్కె ఆస్పత్రి, ఎల్‌బీ నగర్‌లోని కామినేని హాస్పిటల్ సంయుక్తంగా డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో పోలీసులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు బీపీ, షుగర్, ఈసీజీ, టూడీ ఇకో, బీఎండీ పరీక్షలను వైద్యులు నిర్వహించారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, శారీరక శ్రమ చాలా అవసరమని, దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. అంతే కాకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకొని, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఆర్కే హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చావా రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి జనరల్ హెల్త్ చెకప్ చాలా అవసరమని, సిబ్బంది పని ఒత్తిడిలో ఆరోగ్యం చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు, పట్టణ సీఐ భాస్కర్, రూరల్ సీఐ శంకర్‌గౌడ్, హాస్పిటల్ ఇన్‌చార్జ్ ఎంపల్లి కొండల్ రెడ్డి, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఫ ఎస్పీ అక్షాంశ్ యాదవ్


