కంది సాగు.. యాజమాన్య పద్ధతులు | - | Sakshi
Sakshi News home page

కంది సాగు.. యాజమాన్య పద్ధతులు

Jul 26 2026 7:54 AM | Updated on Jul 26 2026 7:54 AM

ఈ పంట సాగుతో నేల సారవంతం

అంతర పంటల్లో భాగంగా కందిసాగు చేయడంతో భూసారం పెరుగుతుంది. పంట ఆకులు, వేర్లు, కాండం నేలలో పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక, రసాయనిక లక్షణాలు మెరుగు పడతాయి. భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి బలంగా, మెత్తగా మారడంతో నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. నీటి వసతి గల ప్రాంతాలలో తొలకరి వర్షాలు పడగానే తక్కువ కాల పరిమితి గల పైర్లు సాగు చేసి దాని తర్వాత కంది పంటను రబీలో కూడా పండించుకోవచ్చు.

పెద్దవూర: ఎల్‌నిలో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆరు తడి పంటలైన కూరగాయలు, పప్పు ధాన్యాలు సాగు చేసుకోవాలని సూచిస్తుంది. ఇందులో భాగంగా కందిని పత్తి, వేరుశనగ వంటి పంటల్లో అంతర పంటగానూ, నేరుగా కందినే సాగు చేసుకుని లాభాలను అర్జించవచ్చని మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ పేర్కొంటున్నారు. ప్రభుత్వం కంది పంటకు మద్దతు ధరకు అదనంగా రూ.800 ప్రకటించిందని తెలిపారు. ఆగస్టు 15 వరకు ఈ పంటను సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. కంది సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై ఆయన పలు సూచనలు చేశారు.

కంది పంటకు అనువైన నేలలు

ఎర్ర భూములు, నల్లరేగడి, మురుగు నీరు పోయే వసతి గల నేలలు అనుకూలం. చౌడు, నీటి ముంపునకు గురయ్యే నేలలు కంది పంట సాగుకు పనికిరావు.

రకం, పంట కాలం, దిగుబడి

● ఎల్‌ఆర్‌జీ 41 రకం పంట కాలం 180 రోజులు. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. శనగపచ్చ పురుగును బాగా తట్టుకుంటుంది. నల్లరేగడి భూములు అనుకూలం. నీటి వసతితో తేలికపాటి భూములలో కూడా పండించవచ్చు.

● లక్ష్మీ(ఐసీపీఎల్‌ 85063) రకానికి చెందిన కంది 160 నుంచి 170 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండుతెగులును కొంతవరకు తట్టుకుంటుంది.

● ఆశ(ఐసీపీఎల్‌87119) రకం కంది 170 నుంచి 180 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దిగుబడి 7–8 క్వింటాళ్లు వస్తుంది. ప్యూజేరియం ఎండు, వెర్రి తెగుళ్లను తట్టుకుంటుంది.

● మారుతి(ఐసీపీ8863) రకం 155 నుంచి 160 రోజుల్లో చేతికి రానుండగా.. ఎకరాకు 7–8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది. మాగాణి, గట్ల మీద పెంచేందుకు అనువైన రకం

● డబ్ల్యూఆర్టీ27 రకం పంట కాలం 180 రోజులు. 7–8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. శనగపచ్చ పురుగును కొంత మేర తట్టుకుంటాయి.

● పాలెం కంది(సీఆర్‌జీ158) పంటకాలం 165–180 రోజులు, ఎకరాకు దిగుబడి 6–7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్యూజేరియం ఎండు తెగులును తట్టుకుంటుంది.

● సూర్య(ఎంఆర్‌జీ1004) రకం పంటకాలం 165–180 రోజులు. దిగుబడి 8–9 క్వింటాళ్లు వస్తుంది.

● వరంగల్‌ కంది53( డబ్ల్యూర్‌జీ) రకం పంటకాలం 160–180 రోజులు. దిగుబడి 6–8 క్వింటాళ్లు. కాయతొలుచు పురుగును కొంత వరకు తట్టుకుంటుంది.

● ఆర్‌జీటీ–1(తాండూరు తెల్లకంది) పంట కాలం 145–155 రోజులు, దిగుబడి 5–6 క్వింటాళ్లు వస్తుంది. ఫ్యూజేరియం ఎండు తెగులును తట్టుకుంటుంది.

● డబ్ల్యూఆర్‌జీ–65(రుద్రేశ్వర) పంటకాలం 160–180 రోజులు. దిగుబడి 8–10 క్వింటాళ్లు. ఎండు తెగులు, శనగపచ్చ పురుగును కొంతవరకు తట్టుకుంటుంది. నల్లరేగడి భూములకు అనువైన పంట.

● టీడీఆర్‌జీ–4(హనుమ) రకం కంది పంట కాలం 160–180 రోజులు. దిగుబడి 8–10 క్వింటాళ్లు. ఎండుతెగులును పూర్తిగా తట్టుకుంటుంది.

● ఐసీసీహెచ్‌–2740(మన్నెంకొండ కంది) పంటకాలం 170–190 రోజులు, దిగుబడి 8–9 క్వింటాళ్లు. ఎండుతెగులును తట్టుకుంటుంది.

విత్తనశుద్ధి

మొదటగా విత్తనాలకు థైరామ్‌ లేదా కాప్టాన్‌ ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున పట్టించాలి. ఆ తర్వాత విత్తుకునే ముందు 200 నుంచి 400 గ్రాముల రైజోబియం ఎకరం విత్తనానికి కలిపి విత్తుకోవాలి. వానాకాలంలో నల్లరేగడి భూమిలో సాలుకు, సాలుకు మధ్య 150 లేదా 180 సెం.మీ., ఎర్ర భూముల్లో సాలుకు, సాలుకు 90 లేదా 120 సెం.మీ., మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి.

ఎరువులు

పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. వానాకాలంలో 8 కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం, యాసంగిలో అయితే 16 కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

ఫ ఆగస్టు 15 వరకు ఈ పంట సాగు చేసుకోవచ్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement