నల్లగొండ: ఒడిశా నుంచి గంజాయి, వీడ్ (హాష్) ఆయిల్‌ను అక్రమంగా తరలించి నల్లగొండలో విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి శనివారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం మునుగోడు బైపాస్ రోడ్డులోని ఖాళీ స్థలంలో కొందరు యువకులు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఎనిమిది మంది నిందితులతో పాటు ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిలో తిప్పర్తి మండలానికి చెందిన కస్పరాజు నాగరాజు ప్రస్తుతం నల్లగొండలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నాడు. తిప్పర్తి మండలం ఖాజీరామారం గ్రామానికి చెందిన గంటెకంపు మధు, నల్లగొండలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన చెన్నపాక సుశాంక్, నల్లగొండలోని మాధవనగర్‌కు చెందిన పెండ్ర వాసు, నల్లగొండలోని పాతబస్తీకి చెందిన సయ్యద్ షోయబ్, సూర్యాపేట తాళ్లగడ్డకు చెందిన గంధం శివమణి, అదే మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన చెరుకు దీపక్, జేజేనగర్‌కు చెందిన నకిరేకంటి ధరణికుమార్ ఉన్నారు. అంతేకాకుండా ఒడిశాకు చెందిన మనుకర్, మహబూబాబాద్‌కు చెందిన హరి, నల్లగొండకు చెందిన ఉదయ్, జున్నులు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితులైన కస్పరాజు నాగరాజు, గంటెకంపు మధులపై గతంలో కూడా పలు కేసులు నమోదై ఉన్నాయి.
చోరీ చేసిన వాహనాలను
ఇచ్చి వాటికి బదులుగా..
త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరంతా ముఠాగా ఏర్పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతుండేవారు. ఈ వాహనాలను ఒడిశాలో ఇచ్చి వాటికి బదులుగా గంజాయి, వీడ్ ఆయిల్ తీసుకొచ్చి నల్లగొండలో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ఎంఎల్ వీడ్ (హాష్) ఆయిల్, 5 బైక్‌లు, 4 సెల్‌ఫోన్లు, ఒక డమ్మీ తుపాకీ, ఒక చాకు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కేసును ఛేదించిన వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్‌ఐలు ముత్తయ్య, సంపత్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారని తెలిపారు.
ఫ ఎనిమిది మంది రిమాండ్,
పరారీలో మరో నలుగురు
ఫ రూ.10 లక్షల
విలువైన గంజాయి స్వాధీనం


