యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ మాఢ వీధిలో శనివారం స్వామి అమ్మవార్ల మొక్కు వస్త్రాలకు ఆలయ అధికారులు వేలం పాట నిర్వహించారు. దేవస్థానంలో మొక్కు వస్త్రాల టెండర్ ముగియడంతో స్వామి అమ్మవార్లకు వచ్చే వస్త్రాలు ఆలయంలోనే భద్రపరుస్తున్నారు. వీటిని భక్తులు వేలం పాటలో పాల్గొని దక్కించుకున్నారు.
ఐకేపీ సెంటర్‌లో అవకతవకలు
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్‌లో అవకతవకలు చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన నిర్వాహకులు గోదాములకు, మిల్లర్లకు తరలించారు. సేకరించిన ధాన్యం బస్తాల్లో ఎక్కువ మొత్తంలో తరుగు పేరుతో ధాన్యం తీసేసారని ఓ రైతు నిర్వాహకులతో వాదించాడు. దీంతో సదరు రైతు ధాన్యం డబ్బులను కొంత మేరకు నిర్వాహాకులు చెల్లించారు. ఈ విషయంపై కొంతమందికి అనుమానం రావడంతో సెంటర్‌లో ధాన్యం బస్తాలపై ఆరా తీశారు. దాతర్‌పల్లి సెంటర్‌లో ఎంత ధాన్యాన్ని తీసుకున్నారు, ఎన్ని ట్రక్ షీట్‌లు అనే వివరాలపై నిర్వాహకులను నిలదీశారు. ఈ క్రమంలో సెంటర్ నుంచి 26000 వేలకు పైగా ధాన్యం బస్తాలు పంపగా, గోదాముల వద్దకు వెళ్లే సమయానికి అదనంగా 400 బస్తాలకు పైగా పెరిగినట్లు గ్రామస్తులకు తెలిసింది. సుమారు 40 మంది రైతులకు నష్టం జరిగిందని, గ్రామానికి చెందిన సెంటర్ నిర్వాహకుడితో రూ.1,50,000 వరకు రైతులకు ఇచ్చే విధంగా మాట్లాడినట్లు సమాచారం.
బైక్ చెట్టును ఢీకొని
ఇద్దరికి గాయాలు
బచ్చన్నపేట : ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్ర సమీపంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన జైదపురం భిక్షపతి, ముక్క పోచయ్య బైక్‌పై బచ్చన్నపేటకు వస్తున్నారు. ఈక్రమంలో బచ్చన్నపేట సబ్‌స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని జనగామకు చికిత్స నిమిత్తం తరలించారు.


