ఫ డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య
భువనగిరిటౌన్ : సమగ్ర ఓటు సవరణ (సర్) ప్రక్రియ పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య సూచించారు. శుక్రవారం భువనగిరిలో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. అనంతరం బూతుల వారీగా నిర్వహించిన సమీక్షలో ఓటర్ల జాబితా పరిశీలన, సవరణలపై పలు కీలక సూచనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, సర్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజులవెంకటేశ్వర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేంద్ర బృందం సందర్శన
భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న జిల్లా మహిళా సమాఖ్య (ఇందిరా మహిళా శక్తి) భవనాన్ని కేంద్ర ఎన్‌ఆర్‌ఎల్‌ఎం (జాతీయ గ్రామీణ జీవనోపాధుల సంస్థ) బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి.నాగిరెడ్డి, కేంద్ర బృందం సభ్యులకు భవన నిర్మాణ పనుల పురోగతితోపాటు పలువ విషయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ నవీన్, నేషనల్ రిసోర్స్ పర్సన్ గిరీష్ ప్రధాన్, మిషన్ మేనేజర్ మహ్మద్ హసన్, అడిషనల్ డీఆర్డీఓ జంగారెడ్డి, డీపీఎంలు స్వర్ణలత, కరుణాకర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్లెక్సీల తొలగింపుపై బీఆర్‌ఎస్ ఆందోళన
ఆలేరు : కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆలేరు పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను శుక్రవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు బస్టాండ్ వెళ్లే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇతర పార్టీల ఫ్లెక్సీలు నెలల తరబడి అలాగే ఉన్నా తొలగించకుండా మూడు రోజుల క్రితం ఏర్పాటు చేసిన తమ ఫ్లెక్సీలను తొలగించడం ఏంటని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు వింటూ మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వివమర్శించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పంతం కృష్ణ, పాకాల హరీష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


