ఆరోగ్యానికి స్వీయ సంరక్షణ ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి స్వీయ సంరక్షణ ముఖ్యం

Jul 24 2026 1:57 AM | Updated on Jul 24 2026 1:57 AM

నేడు అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం

స్వీయ సంరక్షణతో కలిగే ప్రయోజనాలు

● నిరంతర పని ఒత్తిడి వల్ల కలిగే అలసట, ఆందోళన దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుంది.

● మంచి పోషకాహారం, తగినంత నిద్ర, వ్యాయామం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ దొరుకుతుంది.

● శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు ఏ పనినైనా మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా చేయగలుగుతాం.

● మన ఆరోగ్యం, అవసరాలపై మనం శ్రద్ధ వహించినప్పుడు ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం రెట్టింపవుతాయి.

మిర్యాలగూడ అర్బన్‌ : ఆస్పత్రులు, వైద్యుల పైనే పూర్తిగా ఆధారపడకుండా ఎవరికి వారు స్వీయ సంరక్షణ పాటిస్తేనే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేడు అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య పరిరక్షణపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

ఆందోళన కల్గిస్తున్న గణాంకాలు

108 ఈఎంఆర్‌ఐ అత్యవసర సేవల నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 17,940 ఛాతినొప్పి కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా 30 నుంచి 40 ఏళ్ల వయసున్న యువత గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు నెలల్లో గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసులు సైతం వేగంగా పెరుగుతున్నాయి. వీటన్నింటికీ అస్తవ్యస్తమైన ప్రజల జీవనశైలే ప్రధాన కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

ముందస్తు పరీక్షలతోనే మేలు..

● వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితిని పరీక్షించుకోవడం అత్యవసరం.

● గుండె జబ్బులను నివారించడానికి క్రమం తప్పకుండా బీపీ, ఫాస్టింగ్‌ బ్లడ్‌ షుగర్‌, లిపిడ్‌ ప్రొఫైల్‌ తదితర పరీక్షలు చేయించుకోవాలి.

● తాజా పండ్లు, కూరగాయలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి.

● రాత్రి భోజనం తర్వాత కనీసం 30 నిమిషాల పాటు నడవాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

● ప్రతి మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు, మానసిక ప్రశాంతత కోసం నిద్రకు ముందు 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం ఉత్తమం.

స్వీయ సంరక్షణ పద్ధతులు ఇవే..

● శారీరక ఆరోగ్యం: రోజూ సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం దినచర్యలో భాగం చేసుకోవాలి.

● మానసిక ఆరోగ్యం: యోగా, ధ్యానంతో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దైనందిన పనుల నుంచి విరామం తీసుకోవడం, పుస్తకాలు చదవడం లేదా సంగీతం వినడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు.

● సామాజిక, భావోద్వేగ సంరక్షణ: ఆత్మీయులతో సమయం గడపడం, భావాలను ఇతరులతో పంచుకోవడం ముఖ్యం. నచ్చని పనులు లేదా ఇబ్బందికర పరిస్థితులకు ‘వద్దు’ అని చెప్పగలగడం కూడా స్వీయ సంరక్షణలో భాగమే.

● డిజిటల్‌ డిటాక్స్‌: స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియాకు రోజూ కొంత సమయం దూరంగా ఉండటం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది.

● అత్యవసర సేవలు: అత్యవసర సమయంలో 108కి కాల్‌ చేసి, ప్రాణరక్షణ సేవలను సకాలంలో వినియోగించుకోవడంపై అవగాహన కలిగి ఉండటం కూడా బాధ్యతాయుతమైన స్వీయ సంరక్షణే అవుతుంది.

ఫ సరైన నిద్ర, వ్యాయామం, పోషకాహారంతో

వ్యాధులకు చెక్‌

ఫ ఇంటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement