నడిగూడెం : ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను నడిగూడెం మండల వ్యవసాయాధికారి గోలి మల్సూర్ వివరించారు.
కంది : కంది పంటను వచ్చే నెల 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. ఎల్‌ఆర్‌జి–41, ఐసీపీఎల్–85063, ఐసీపీఎల్–87119, ఐసీపీఎల్–8866, పీఆర్‌ఎజీ–158, డబ్ల్యూఆర్‌జీ–65 తదితర రకాలను సాగు చేసుకోవచ్చు. ముందుగా కిలో కంది విత్తనాలకు 3 గ్రాముల థూరమ్ లేదా క్యాప్టాన్‌ను పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తుకొనే ముందు 200–400 గ్రాముల రైజోబియంను పట్టించి విత్తుకోవాలి. పెండిమిథాలీన్ 30 శాతం కలుపు మందు ఎకరానికి 1.2 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి.
పత్తి : పత్తి నాలుగు వరసలు, కంది ఒక వరుసలో విత్తుకొని సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తగిన తేమ ఉన్నప్పుడు పంట ఎదుగుదలను పెంచేందుకు ఎకరానికి 20 కిలోల యూరియా, 15 కిలోలు మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేయాలి. వర్షాభావ పరిస్థితుల్లో కోలుకొనేందుకు 19:19:19 పోషకాన్ని లేదా మల్టీ–కె లేదా 10 గ్రాముల యూరియాను లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పత్తి మొక్కలపై పిచికారీ చేయాలి. భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు గుంటుక లేదా గొర్రుతో అంతరకృషి చేసి కలుపును నివారించుకోవాలి.
పెసర, మినుము : పెసర, మినుములను ప్రస్తుతం విత్తుకోవచ్చు. ఇది వరకు విత్తుకున్న పెసర, మినుముల్లో ఆశించే చిత్త పురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ. మందును ఎకరానికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో ఆశించిన తామర పురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా డైమీథోయేట్ 2 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే టమాటలో ఆకు ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మిరప : ఈ తరుణంలో మిరప నారును నాటుకోచువచ్చు. ఖాళీగా ఉన్న నేలల్లో కూరగాయల పంటలను సాగు చేయవచ్చు. ఎత్తైన నారుమడులు తయారు చేసుకొని కూరగాయల విత్తనాలు విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్, 3 గ్రాముల క్యాప్టాన్‌తో విత్తనశుద్ధి చేసి విత్తుకుంటే రసం పీల్చు పురుగులు, ఆకుమచ్చ తెగులును నిరోధించవచ్చు.


