యాదగిరిగుట్ట: దేశంలో, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురువాలని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అర్చకులు, వేద పండితులు, పూజారుల సమక్షంలో వర్ష పాశుపత వరుణ యాగాన్ని నిర్వహించినట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో మూడు రోజులుగా కొనసాగుతున్న వర్ష పాశుపత వరుణ యాగం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయంలో చివరి రోజు పూజల్లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి చెరువు, కుంటలు నిండి రైతాంగం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో వరుణుడిని కోరుతూ ఈ యాగం చేసినట్లు వెల్లడించారు. కరువు వస్తే ప్రభుత్వంపై ప్రభావం పడుతుందని ఈ నేపథ్యంలో యాదగిరీశుడి ఆలయంలో వరుణ యాగం చేసి వర్షం కురువాలని వరుణ దేవుడిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. వర్షాలు కురువని సమయంలో గతంలో రాజులు సైతం వరుణ యాగం చేశారని గుర్తు చేశారు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు సుభిక్షంగా ఉండాలనే ఆలోచనతో యాగం వేద మంత్రాలతో నిర్వహించారన్నారు. ఈ యాగంతో వరుణుడు శాంతించడం ద్వారా రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు శివాలయంలోని యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతిలో మంత్రి పాల్గొన్నారు. ముందుగా యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలకు అర్చకులు సంప్రదాయంగా స్వాగతంపలికి, దర్శనం అనంతరం వేద ఆశీర్వనం నిర్వహించారు. ఆమె వెంట అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, వైటీడీ పాలక మండలి సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్, ఈఓ భవానీ శంకర్, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
ఫ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
ఫ యాదగిరి క్షేత్రంలో ముగిసిన వర్ష పాశుపత వరుణ యాగం


