ఫ రూ.1.80 లక్షల నగదు, 2.5 తులాల బంగారం అపహరణ
మిర్యాలగూడ అర్బన్ : గోల్డ్ షాపు యజమాని ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలో బుధవారం జరిగింది. మిర్యాలగూడలోని షాబూనగర్‌కు చెందిన గౌరు సతీష్ స్థానిక పెద్దబజారులో గోల్డ్ షాపు నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం భార్యతో కలిసి అతడు షాపు వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం సతీష్ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.1.80లక్షల నగదు, 2.5 తులాల బంగారం అపహరించారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి చోరీ జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్‌టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ నాగభూషణరావు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కేతేపల్లి : విజయవాడ–హైదరాబాద్ హైవేపై కేతేపల్లి మండలం చీకటిగూడెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. కేతేపల్లి మండలం ఉప్పలపహాడ్‌కు చెందిన కుక్కముడి శ్రీనివాస్(44) కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం ఉదయం డీజిల్ కోసం బైక్‌పై చీకటిగూడెం శివారులోని పెట్రోల్ బంక్ వద్దకు బయల్దేరాడు. చీకటిగూడెం బస్ స్టేజీ వద్ద హైవేపై యూటర్న్ తీసుకుంటుండగా.. విజయవాడ వైపు వెళ్తున్న టస్కర్ వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు. మృతుడికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


