యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆగమ శాస్త్ర పూజా విధానాలు, ఆలయ సంప్రదాయ పరిరక్షణపై స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్(ఎస్‌ఐటీఏ) ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఎస్‌ఐటీఏ డైరెక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు, ప్రొఫెసర్ జీఎస్ కుర్మానందస్వామి, జీవీ శేషవతార స్వామి, ఎంవీ రామారావు, దరూరి రామాచార్యులు, రిటైర్డ్ ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట దేవాలయానికి వచ్చే భక్తులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు దేవాలయ నిర్వహణలో పారదర్శకత, ఆధ్యాత్మిక విలువలను బలోపేతం చేసేలా ప్రభుత్వ నిబంధనలు, పరిపాలన అంశాలపై ఆలయ సిబ్బంది, అర్చకులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు.


