ఆలేరురూరల్ : అప్పటివరకు సరదాగా నవ్వుతూ ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని మృత్యువు ఆటో రూపంలో కబళించింది. వేగంగా దూసుకొచ్చిన ఆటో ఢీకొని ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు, చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొలనుపాక గ్రామానికి చెందిన శ్రీరాముల కరుణాకర్, కీర్తన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కరుణాకర్ గ్రామంలోనే సెలూన్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి రెండో కుమార్తె శ్రీహన్సిక(3) మంగళవారం ఉదయం ఇంటి ముందు రోడ్డుపై ఆడుకుంటుండగా.. అదే గ్రామానికి చెందిన ట్రాలీ ఆటో వేగంగా వచ్చి చిన్నారిని ఢీకొని ఆమైపె నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికుల సహాయంతో తల్లిదండ్రులు ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. చిన్నారి తండి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వినయ్ తెలిపారు.
పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా..
శ్రీహన్సిక మృతికి కారణమైన ఆటో డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని చిన్నారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆలేరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
ఫ ఇంటి ముందు ఆడుకుంటుండగా
ఆటో ఢీకొని చిన్నారి మృతి


