‘ఐకెమ్‌ఈ’ ఫెలోగా శశి రవి సుమన్‌ రుద్రంగి ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

‘ఐకెమ్‌ఈ’ ఫెలోగా శశి రవి సుమన్‌ రుద్రంగి ఎన్నిక

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్‌ శాస్త్రవేత్త డా. శశి రవి సుమన్‌ రుద్రంగి ప్రతిష్టాత్మకమైన ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజనీర్స్‌(ఐకెమ్‌ఈ) ఫెలోగా ఎన్నికయ్యారు. కెమికల్‌ ఇంజనీరింగ్‌, ఫార్మాస్యూటికల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌లో ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం లభించింది. ప్రస్తుతం ఆయన ఐర్లాండ్‌లోని ఒలేమా ఆంకాలజీ సంస్థలో సీఎంసీ డ్రగ్‌ ప్రొడక్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజనీర్స్‌ ఫెలోగా ఎన్నిక కావడం తన వృత్తి జీవితంలో ఒక గొప్ప మైలురాయన్నారు. దీని వెనుక తన కుటుంబ సభ్యులు, గురువులు, సహోద్యోగుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నారు. ఫార్మాస్యూటికల్‌ ఇంజనీరింగ్‌ అభివృద్ధికి, ప్రపంచవ్యాప్తంగా రోగుల జీవి తాలను మెరుగుపర్చే ఔషధాల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆయన తెలిపారు.

విద్యుదాఘాతంతో

గేదె మృతి

తుంగతుర్తి : మండలంలోని దేవునిగుట్ట తండా గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో గేదె మృతిచెందింది. తండాకు చెందిన గుగులోతు ఈరు గేదె పొలంలో మేత మేస్తుండగా.. గానుగబండ ఫీడర్‌కు చెందిన ఎల్‌టీ లైన్‌ కింద పడిపోవడంతో ఆ వైరు గేదెకు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన గేదె మృతిచెందిందని బాధిత రైతు ఆరోపించాడు. తమ కుటుంబానికి మృతిచెందిన గేదె జీవనాధారమని, విద్యుత్‌ అధికారులు నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు.

నర్సు అదృశ్యం

ఇబ్రహీంపట్నం రూరల్‌: విధులకు వెళ్లిన నర్సు అదృశ్యమైంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. సీఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లికి చెందిన అందుగుల వెన్నెల రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ సమీపంలోని మహోనియా ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ నెల 13న డ్యూటీకి వెళ్లిన ఆమె సాయంత్రం తండ్రి మనోహర్‌కు ఫోన్‌ చేసి ఆధార్‌ కార్డు కోసం మల్కాజ్‌గిరిలో ఉంటున్న తన బాబాయి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పింది. 14న డ్యూటీకి రాకపోవడంతో ఆస్పత్రి నుంచి తండ్రికి ఫోన్‌ చేశారు. దీంతో ఆయన ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో మంగళవారం ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ కిందకు

దూసుకెళ్లిన బైక్‌

గరిడేపల్లి : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పెట్రోల్‌ బంక్‌లో నుంచి రివర్స్‌ తీసుకుంటున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌ లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటన గరిడేపల్లి మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి శివారులోని భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో డీజిల్‌ నింపించుకున్న అనంతరం లారీని డ్రైవర్‌ రివర్స్‌ తీస్తుండగా.. ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను లారీ వెనుక భాగం తగిలింది. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదాన్ని ముందే గమనించి బైక్‌పై నుంచి కిందకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. బైక్‌ మాత్రం లారీ కిందకు వెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement