నేటి నుంచి గ్రామ సభలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి గ్రామ సభలు

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

విధులకు హాజరుకాకపోతే కఠిన చర్యలు

సాక్షి, యాదాద్రి : వానాకాలం సీజన్‌ను సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు, వివిధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 4వ తేదీ (గురువారం), 6, 8, 10వ తేదీల్లో ప్రత్యేక గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లో ప్రధానంగా పారిశుద్ధ్యం– విద్యుత్‌, స్వచ్ఛమైన తాగునీరు, భూములు, వ్యవసాయం, ఉపాధిహామీ ఇలా ఎనిమిది అంశాలపై చర్చించనున్నారు.

నాలుగు రోజుల్లో నిర్వహించేలా..

జిల్లావ్యాప్తంగా 427 గ్రామపంచాయతీలు, ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. మండలాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించి ఈ గ్రామసభలను నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల్లో వందశాతం గ్రామపంచాయతీల్లో గ్రామసభలను నిర్వహించేందుకు షెడ్యూల్‌ రూపొందించారు. ఇప్పటికే జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి అధికారుల వరకు ఆదేశాలు ఇచ్చారు.

గ్రామ సభల్లో చర్చించే అంశాలు

పారిశుద్ధ్యం–విద్యుత్‌: గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం, మురికి కాలువల పూడికతీత, దోమల నివారణకు నూనె గుళికల తయారీ, వీధి దీపాల నిర్వహణ చేపట్టాలి. పడిపోయేలా ఉన్న ఇళ్లను గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు ‘చెత్త, మురుగు నీటి నిర్వహణ–2026’ నిబంధనలను పక్కాగా అమలు చేయాలి.

స్వచ్ఛమైన తాగునీరు: ఎత్తయిన నీటి నిల్వ తొట్టెలను నిర్ణీత వ్యవధిలో శుభ్రపరచాలి. పైపుల లీకేజీలను అరికట్టి, క్లోరినేషన్‌ చేసిన తాగునీటిని ప్రజలకు అందించాలి.

ఓటర్ల జాబితా: రాబోయే జనగణన 2027కు సన్నాహాలు చేయడంతో పాటు ఓటర్ల జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలి.

వ్యవసాయం: వర్షాభావ పరిస్థితులు, ఎల్‌ నినో పరిణామాలపై రైతులకు అవగాహన కల్పించాలి. పంటల మార్పిడి పద్ధతులను ప్రోత్సహించాలి.

● ఉపాధి హామీ, నీటి సంరక్షణ: జల సంరక్షణ , మన సంరక్షణలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ కట్టడాలు, ఇంకుడు గుంతల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.

వైద్యం – ఆరోగ్యం: వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో రుతు సంబంధిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.

విద్య, గృహ నిర్మాణం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు బడిబాట కార్యక్రమం చేపట్టాలి, అల్పాహార భోజన పథకం అమలు చేయాలి. గృహాలపై సౌర విద్యుత్‌ ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశాలు, రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలి.

శాంతిభద్రతలు: గ్రామాల్లో మత్తు పదార్థాల నివారణ, రోడ్డు ప్రమాదాల నిరోధం, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక నిఘా ఉంచాలి.

మున్సిపాలిటీల్లో..

● ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026 అమలు

● ఇంకుడు గుంతల నిర్మాణం

● మురుగు కాలువలు శుభ్రం చేయడం, పూడిక తీత పనులు.

● వర్షాకాల సంసిద్ధత పై కార్యాచరణ ప్రణాళిక

● మంచి నీటి సరఫరా, నిర్వహణ.

● నీరు నిల్వ ఉండే ప్రాంతాల నివారణ,

పారిశుద్ధ్యం

● రోడ్ల నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు.

● మొక్కలు, పర్యావరణ సంరక్షణ , ప్రజల ఫిర్యాదుల తక్షణ పరిష్కారం.

గ్రామసభల నిర్వహణను అధికారులు అత్యంత ప్రాధాన్యత కలిగిన విధిగా భావించాలి. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు, డివిజనల్‌ పంచాయతీ అధికారులు, మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, విస్తరణ అధికారులు, అన్ని సంబంధిత శాఖల అధికారులు నిర్దేశిత కాలపట్టిక ప్రకారం గ్రామసభలకు తప్పనిసరిగా హాజరుకావాలి. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. విధులకు హాజరుకాకపోయినా, బాధ్యతల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటాం.

– కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ఫ 4,6,8,10 తేదీల్లో నిర్వహణ

ఫ ఎనిమిది అంశాలపై చర్చ

ఫ ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారుల ప్రణాళిక

Advertisement
 
Advertisement
Advertisement