సాక్షి, యాదాద్రి: జిల్లాలోని చేనేత సహకార సంఘాల ఓటరు నమోదు ప్రక్రియ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న చేనేత, పవర్ లూమ్ సహకార సంఘాల సభ్యుల ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్‌కు జిల్లా అధికారులు పంపించారు. జిల్లాలోని 42 సహకార సంఘాల్లో 31 సహకార సంఘాల జాబితా పూర్తికాగా , ఆలేరు శివశంకర్ సిల్క్ సొసైటీ సభ్యత్వాల కోసం హైకోర్టును ఆశ్రయించింది. మిగతా సంఘాల్లో కొందరు సభ్యుల ఫొటోలు లేకపోవడంతో వాటిని సరిచేసి ఒకటి రెండు రోజుల్లో పంపిస్తున్నారు.కాగా చనిపోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడంతో పెద్ద ఎత్తున ఓటర్ల సంఖ్య తగ్గింది. తుది జాబితా ప్రకారం జిల్లావ్యాప్తంగా 8758 ఓటర్లు కాగా ఇందులో 5556 మంది పురుషులు, 3202 మంది మహిళలు ఓటర్లుగా నమోదయ్యారు. ఈ జాబితా ఆధారంగానే ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
వలిగొండ : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. బుధవారం వలిగొండ మండలం నాగారంలోని వాసవీ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ వెంకారెడ్డి తో కలిసి తనిఖీ చేశారు. రైస్ మిల్లులో ధాన్యం లోడు లారీలు ఎన్ని ఉన్నాయని ఆరా తీశారు. లోడ్ తో వచ్చిన లారీలను ఎప్పటికప్పుడు అన్‌లోడ్ చేయాలన్నారు. అనంతరం లోతుకుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. స్కూళ్లు తెరిచే సమయం ఆసన్నమైనందున మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పక్కనే ఉన్న ఆదర్శ పాఠశాల వసతి గృహంలో పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారిణి రోజా రాణి, జిల్లా విద్యాధికారి భిక్షపతి, స్థానిక సర్పంచ్ గండు రాములు యాదవ్, స్థానిక తహసీల్దార్ దశరథ, పాఠశాల ఎస్ ఓ దుర్గ, ఆర్ ఐ కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
రవాణా శాఖ అధికారిగా నరేష్ బాధ్యతల స్వీకరణ
భువనగిరి: జిల్లా రవాణాశాఖ అధికారిగా ఎస్. నరేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సంగారెడ్డి నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ డీటీఓగా విధులు నిర్వహించిన సాయికృష్ణ బదిలీపై నాగర్‌కర్నూల్ జిల్లాకు ఎంవీఐగా వెళ్లారు. ఎంవీఐగా విధులు నిర్వహించిన ఇమ్రాన్ అహ్మద్ నాగర్‌కర్నూల్ డీటీఓగా బదిలీపై వెళ్లారు.
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు.
ఎంజీయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా అరుణప్రియ
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా కె.అరుణప్రియ నియమితులయ్యారు. రిజి స్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి నుంచి బుధవారం ఆమె నియామకపత్రం అందుకున్నారు. గతంలో ప్రిన్సిపాల్‌గా, అడిషనల్ కంట్రోలర్‌గా సేవలందించిన ఆమె తిరిగి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు కళాశాల అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపారు.


