గృహ ప్రవేశం ఏమాయే! | - | Sakshi
Sakshi News home page

గృహ ప్రవేశం ఏమాయే!

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

భువనగిరిటౌన్‌ : రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా జూన్‌ 2 నాటికి పనులు పూర్తి చేసి, లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయిస్తామన్న ప్రభుత్వ హామీ నెరవేరకపోవడంతో భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లవద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పనులు పూర్తి కాలేదన్న ఆగ్రహంతో లబ్ధిదారులు ఇళ్ల వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ‘మా ఇళ్లను మేమే శుభ్రం చేసుకుంటాం.. మరమ్మతులు చేసుకుని ఇక్కడే ఉంటాం’ అంటూ లబ్ధిదారులు నిర్మాణంలో ఉన్న గదుల్లోకి చొచ్చుకెళ్లారు. పొరకలు పట్టి ఇళ్లను శుభ్రం చేయడం ప్రారంభించారు. దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది.

లబ్ధిదారులతో ఆర్డీఓ చర్చలు

లబ్ధిదారుల ఆందోళన తీవ్రంకావడంతో ఆర్డీఓ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని పిలిచి చర్చలు జరిపారు. పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయిస్తామని, పనులు త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపడతామని ఆర్డీఓ తెలియజేశారు. సాంకేతిక, ఆర్థిక కారణాల వల్లే గడువులోగా పూర్తి చేయలేకపోయామని నచ్చజెప్పారు. ఈ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని, కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బకాయిల కింద నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆర్డీఓ ప్రకటించారు. ఈ నిధులతో నిలిచిపోయిన పనులను పూర్తి చేయిస్తామని భరోసా ఇచ్చారు. పెండింగ్‌ పనులన్నీ రెండు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామని చెప్పారు. స్పష్టమైన హామీ లభించడంతో లబ్ధిదారులు నిరసనను విరమించుకున్నారు. ఈ ఆందోళనకు బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఏ వి కిరణ్‌ కుమార్‌, రచ్చ శ్రీనివాస్‌ రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు నాకోటి నగేష్‌, చీమల రాజు, నాయకులు చెన్న మహేష్‌, ఖాజా అజీముద్దీన్‌, ఏలే శివ, తాడూరు భిక్షపతి, ఎన్నబోయిన జాంగీర్‌, ఇక్బాల్‌ చౌదరి, శాగంటి నరసింహ, కాజం,గుజ్జ పవన్‌, సిరిపంగ సుభాష్‌, వేముల కష్ణ, నాగారం సూరజ్‌, అంజాద్‌, రొయ్యల పవన్‌,చిన్న సంఘీభావం తెలిపారు. ఈ సమస్యపై చర్చించేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులను గురువారం ఆర్డీఓ కార్యాలయానికి ఆర్డీఓ ఆహ్వానించారు.

ఫ హామీ అమలు కాలేదని లబ్ధిదారుల ఆందోళన

ఫ సింగన్నగూడెంలో నిర్మాణంలోఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఊడ్చి నిరసన

Advertisement
 
Advertisement
Advertisement