భువనగిరి: కొత్త ఆసరా పింఛన్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న నిరుపేదలు, వృద్ధులకు మరోసారి నిరాశే ఎదురైంది. జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం తీపికబురు చెబుతుందని ఆశించిన అర్హుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కొత్త దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సర్కారు నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో.. అసలు పింఛన్లు ఇప్పట్లో వస్తాయా? రావా? అన్న అయోమయం నెలకొంది. ప్రకటనలకే పరిమితమైన ఈ కొత్త పింఛన్ల కోసం.. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అర్హులు మళ్లీ నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
స్పష్టత రాక..
గ్రామీణ ప్రాంతాల్లో వయస్సు పైబడి ఎంతో మంది వృద్ధులు జీవనోపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు కుటుంబ సభ్యులు పై అధారపడి కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేసిన ప్రకటనతో తమకు ఇక ఆసరా ఫించన్ వస్తుందని ఆశపడ్డారు. కానీ ప్రభుత్వం జాప్యంతో మళ్లీ ఎదురు చూపులు తప్పే పరిస్థితి మాత్రమే కనిపిస్తోంది.
ఐదు వేల మందికి
వచ్చే అవకాశం
ప్రస్తుతం జిల్లాలో వివిధ రకాల పింఛన్ పొందుతున్న వారు 96,425 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షలకు పైగా కొత్తగా ఫించన్ మంజూరు చేస్తామని ప్రకటన చేయడంతో జిల్లాలో జనాభా, అర్హుల జాబితా ప్రకారం సుమారు 5వేల మందికి కొత్తగా పింఛన్ వచ్చే అవకాశం ఉంది.
నిలిచిన ప్రక్రియ
జూన్ 2న కొత్తగా పింఛన్ ఇస్తామని ప్రకటించిన దానికి సంబంధించి ప్రక్రియ ఎక్కడా ప్రారంభం కాలేదు.కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి గానీ అర్హులను ఎంపిక చేయడానికి గానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆప్షన్ ను ప్రభుత్వం ఇవ్వలేదు. దీంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.
కొత్త పింఛన్లకు సంబంధించిన ప్రక్రియ పై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకోవడానికి ఎ లాంటి ఆప్షన్ ఇవ్వలేదు. గతంలో కొత్తగా చేసుకున్న వారి దరఖాస్తులు మండల స్థాయిలోనే ఉన్నాయి.
–నాగిరెడ్డి డీఆర్‌డీఓ
ప్రస్తుతం పింఛన్ అందుకుంటున్న లబ్ధిదారుల వివరాలు
వృద్ధులు 35,419
వితంతువులు 35,908
వికలాంగులు 12,435
కల్లుగీత కార్మికులు 5,548
చేనేత కార్మికులు 3,006
ఫైలేరియా 500
డయాలసిస్ 221
ఒంటరిమహిళలు 2,473
బీడీ కార్మికులు 915
ఫ ప్రకటనలకే పరిమితమైన కొత్త పింఛన్లు
ఫ అవతరణ వేడుకల్లో స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
ఫ అర్హుల ఎదురుచూపులు


