మోత్కూరు: ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, లారీలు అందుబాటులో లేక పోవడంతో మోత్కూరు మండలం పాలడుగు గ్రామ రైతులు బుధవారం రోడ్డెక్కారు. ఉదయం 7 గంటల నుంచే వలిగొండ–తొర్రూరు జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ ఆందోళన రెండు గంటలకు పైగా కొనసాగడంతో వాహనాలు నిలిచి పోయాయి. తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తూకాలు వేసి వారాలు గడుస్తున్నా ఇప్పటికీ మిల్లులకు తరలించ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు రాక పోవడంతో ధాన్యం కల్లాల్లోనే ఉందని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చి చెప్పారు. తహసీల్దార్ జ్యోతి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ధాన్యం మిల్లులకు తీసుకెళ్లిన తరువాత కూడా కోత విధిస్తున్నారని రైతులు ఆమె దృష్టికి తెచ్చారు. లారీ కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


