ఆధ్యాత్మిక నగరి.. మన యాదగిరి | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక నగరి.. మన యాదగిరి

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

భక్తుల సంఖ్య పెరుగుతోంది

సాక్షి, యాదాద్రి : తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత గత ప్రభుత్వ హయాంలో యాదగిరిగుట్ట క్షేత్రం ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంది. ఎంతో ప్రాశస్త్యం ఉన్న యాదగిరిగుట్ట ఆలయం సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురైంది. భక్తుల మనోభావాలకు అనుగుణంగా, మారుతున్న కాలానికి తగ్గట్టుగా అభివృద్ధికి నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని రూ.1200 కోట్లతో పునఃనిర్మించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వైటీడీ యాదగిరిగుట్ట దేవస్థానం చట్టం చేసింది. త్వరలో ప్రత్యేక పాలకమండలి రాబోతోంది. ప్రధానాలయాన్ని కృష్ణ రాతి శిలలతో నిర్మించారు. ఇంపైన ప్రాకారాలు, సొగసైన రాజగోపురాలతో కనీవినీ ఎరుగని రీతిలో ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ ప్రధాన గోపురాన్ని స్వర్ణమయం చేశారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను గండిచెరువుకు రప్పించి నారసింహుడికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో యాదగిరిగుట్టలో తిరు మాడవీధులు లేవు. సున్నంతో ఆలయాన్ని సుందరీకరించేవారు. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత యాదగిరీశుడి ప్రధానాలయాన్ని 4.30 ఎకరాల్లో నిర్మించారు. బ్రహ్మోత్సవ మండపం, మాడవీధులు, ప్రాకారాలు, సప్తతల, పంచతల రాజగోపురాలు, వేంచేపు మండపం, రథశాల, లిఫ్ట్‌ నిర్మించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదర్శనకు వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల కోరిక మేరకు నిత్య గిరి ప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుతం యాదగిరి క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మే 31న సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ఆలయ చరిత్రలోనే సరికొత్త రికార్డు. పెరిగిన సదుపాయాలు, ఆలయ సుందరీకరణతో యాదాద్రి క్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోంది. ఆదాయం సైతం లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయలకు పెరిగింది.

పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలి..

యాదగిరి కొండ పైన ఉన్న విష్ణుపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడాన్ని పునరుద్ధరించాలని, అదేవిధంగా కొండ పైకి ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని, భక్తులకు సరిపడా టాయిలెట్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. టీటీడీ తరహాలో వైటీడీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంతవరకు పాలకమండలిని ప్రకటించలేదు. మొదటి ఘాట్‌ రోడ్డు నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కొండ కింద గండి చెరువు అభివృద్ధి, దుకాణాల సముదాయం, దేవస్థానం బస్టాండ్‌, ఎంట్రీ ఫ్లైఓవర్‌ వంటి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

ఫ తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట

ఫ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.1200కోట్లతో పునర్నిర్మాణం

ఫ నృసింహుడి దర్శనానికి పెరిగిన భక్తులు

యాదగిరిగుట్టలో భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లక్షమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా వసతులు కల్పించాం. సీఎం ఇటీవల కొండపైన దీక్షాపరుల మండపం, పార్కింగ్‌, నిత్య కల్యాణ మండపం, వేద పాఠశాలకు శంకుస్థాపన చేశారు. భక్తుల కోరిక మేరకు క్షేత్రంలో వసతులు కల్పిస్తాం.

– భవానీ శంకర్‌, ఈఓ, యాదగిరిగుట్ట

Advertisement
 
Advertisement
Advertisement