జడ్చర్ల–కోదాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

జడ్చర్ల–కోదాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

డిండి : జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ స్టేజీ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. 131 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొడేరు మండలానికి చెందిన కొంతమంది గొర్రెల కాపరులు తమ గొర్రెలను మేత కొరకు ఆరు నెలల క్రితం ఏపీలోని గుంటూరుకు తరలించారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో గొర్రెలను తిరిగి స్వగ్రామానికి ఐదు డీసీఎంలలో తీసుకొస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే ముందుగా వచ్చిన డీసీఎం రెండు టైర్లు పంక్చర్‌ కావడంతో డ్రైవర్‌ రోడ్డు పక్కన నిలిపివేశాడు. వెనకాలే వస్తున్న రెండో డీసీఎంను కూడా అక్కడే నిలిపి ఇద్దరు డ్రైవర్లు వాహనానికి మరమ్మతులు చేస్తుండగా.. అదే మార్గంలో వేగంగా వచ్చిన మూడో డీసీఎం ఆగి ఉన్న రెండు డీసీఎంలను ఢీకొట్టి పల్టీ కొట్టింది. మూడవ డీసీఎంలో ముందు కూర్చున్న చిటగోడు ఎల్లయ్య(35) అక్కడికక్కడే మృతిచెందగా.. అతడి భార్య పద్మ, డ్రైవర్‌ గిద్ద రాముకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 131 గొర్రెలు మృతిచెందాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పశువైద్యాధికారులు మృతిచెందిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అక్కడే వ్యవసాయం పొలంలో వాటిని పూడ్చి పెట్టారు. ఎల్లయ్య మృతదేహానికి దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి స్టేషన్‌ ఆఫీసర్‌ షరీఫ్‌ తెలిపారు.

మృతుడి కుటుంబ సభ్యులకు పరామర్శ..

ప్రమాదం గురించి తెలుసుకున్న ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ సరితాయాదవ్‌, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్‌ బాలూనాయక్‌, కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మల్లేష్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన గొర్రెల కాపరి ఎల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి అతడి భార్యకు రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార కార్పొరేషన్‌ నుంచి మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని చైర్మన్‌ సరితాయాదవ్‌ హామీ ఇచ్చారు.

ఫ రోడ్డు పక్కన ఆగి ఉన్న రెండు

డీసీఎంలను ఢీకొట్టిన మరో డీసీఎం

ఫ ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

ఫ డీసీఎంలలో తరలిస్తున్న 131 గొర్రెలు మృత్యువాత

ఫ డిండి మండలం బ్రాహ్మణపల్లి

గ్రామ స్టేజీ వద్ద ఘటన

Advertisement
 
Advertisement
Advertisement