చెక్‌బౌన్స్‌ కేసులో జైలుశిక్ష, జరిమానా | - | Sakshi
Sakshi News home page

చెక్‌బౌన్స్‌ కేసులో జైలుశిక్ష, జరిమానా

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

కోదాడరూరల్‌ : చెక్‌బౌన్స్‌ కేసులో ఓ వ్యక్తికి జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ బుధవారం కోదాడ కోర్టు తీర్పు వెలువరించింది. 2016లో కోదాడ పట్టణానికి చెందిన కర్నాటి అశోక్‌ వద్ద ఎలగందుల శ్రీనివాసరావు రూ.11 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఆ డబ్బుకు సంబంధించి శ్రీనివాసరావు చెక్కు ఇచ్చాడు. ఆ చెక్కును అశోక్‌ బ్యాంకులో వేయగా ఖాతాలో డబ్బులు లేక బౌన్స్‌ అయింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగా.. శ్రీనివాసరావుకు ఆరు నెలల జైలుశిక్షతో పాటు అప్పుగా తీసుకున్న రూ.11లక్షలు తిరిగి చెల్లించాలని లేదంటే మరో నెల రోజులు జైలుశిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు వెలువరించింది.

వడదెబ్బతో వృద్ధుడు మృతి

గుండాల : మండలంలోని మాసాన్‌పల్లి గ్రామానికి చెందిన బత్తిని చినఅంజయ్య(70) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఎండల తీవ్రత పెరగడంతో అస్వస్థతకు గురై బుధవారం మృతిచెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

తుంగతుర్తికి

ఏసీబీ అధికారులు

తుంగతుర్తి : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడైన అడిషనల్‌ ఎస్పీ భుజంగరావు బంధువుల ఇంట్లో తనిఖీ కోసం బుధవారం ఏసీబీ అధికారులు తుంగతుర్తికి వచ్చారు. తుంగతుర్తిలో ఉంటున్న భుజంగరావు మామ దుగ్యాల రాజేశ్వరరావు(రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి) ఇంట్లో తనిఖీ చేసేందుకు రాగా.. ఇంట్లో ఎవరూ లేరని, తాళం వేసి ఉన్నట్లు ఏసీబీ అధికారి బాలకృష్ణ తెలిపారు.

చిన్నారులను గాయపర్చిన కోతులు

శాలిగౌరారం : మండల కేంద్రంలో బుధవారం కోతుల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన మనస్వి తన ఇంటిపై ఆరేసిన బట్టలు తీసుకొచ్చేందుకు వెళ్లగా కోతులు ఒక్కసారిగా ఆ చిన్నారిపై దాడి చేయడంతో చేతికి గాయాలయ్యాయి. అదేవిధంగా తమ కిరాణ షాపు ముందు కూర్చున్న సాయిపై కూడా కోతులు దాడి చేయడంతో అతడికి కూడా గాయాలయ్యాయి. చిన్నారులను కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయించారు.

పర్యావరణ పరిరక్షణకు

కృషి చేయాలి

నల్లగొండ టూటౌన్‌ : పర్యావరణ పరిరక్షణకు ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు కృషి చేయాలని ఎంజీ యూనివర్సిటీ కోఆర్డినేటర్‌ మారం వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు, ఎంజీయూ జాతీయ సేవా పథకం విద్యార్థులకు పర్యావరణ కాలుష్య నియంత్రణ, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం అనే అంశంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించుకోవాలని, కాలుష్యంపై ప్రజలకు విస్తృతంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్లు విజయ్‌కుమార్‌, రామచంద్ర, ఎం. ఆనంద్‌, షరీఫ్‌, శ్రీనివాస్‌, రమేష్‌నాయక్‌, కట్టా కిరణ్మయి, శ్రీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement