పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగొస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగొస్తుండగా..

Jun 4 2026 7:15 AM | Updated on Jun 4 2026 7:15 AM

నార్కట్‌పల్లి : మినీ ట్రావెల్స్‌ బస్సులో పుణ్యక్షేత్రాలకు వెళ్లి తిరిగొస్తూ డీసీఎంను ఢీకొనడంతో బాలిక మృతిచెందింది. మరో 14 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై నార్కట్‌పల్లి శివారులోని ఫ్లైఓవర్‌ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్‌ మండలం ఎల్కపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల నరేష్‌ కుటుంబంతో పాటు అదే గ్రామానికి చెందిన మరికొందరు హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వారంతా కలిసి మినీ ట్రావెల్స్‌ బస్సులో వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. కాగా.. బుధవారం అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై నార్కట్‌పల్లి శివారులోని ఫ్లైఓవర్‌ వద్ద రోడ్డుపై ఆపిన గుర్తుతెలియని వాహనాన్ని డీసీఎం ఢీకొని రహదారిపైనే నిలిచిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీసీఎంను రోడ్డు పక్కకు తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో వెనుకనే వస్తున్న మినీ ట్రావెల్‌ బస్సు డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనగందుల నరేష్‌ కుమార్తె ద్రోణిక (10) అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు 108 వాహనంలో స్థానిక కామినేని హాస్పిటల్‌ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్‌పల్లి ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపారు.

వాహనాలు ఆపడం వల్లే ప్రమాదాలు..

అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై రాత్రివేళ హోటళ్లు తెరిచి ఉండడంతో డ్రైవర్లు లారీలను రోడ్డుపైనే ఆపుతుండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు రాత్రివేళ పర్యవేక్షణ చేయకపోవడంతో ఇష్టారాజ్యంగా వాహనాలు ఆపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల ఆరోపిస్తున్నారు.

ఫ డీసీఎంను ఢీకొట్టిన మినీ ట్రావెల్స్‌ బస్సు

ఫ బాలిక మృతి..

మరో 14 మందికి గాయాలు

ఫ నార్కట్‌పల్లి శివారులో ఘటన

Advertisement
 
Advertisement
Advertisement