రెన్యువల్‌ చేస్తారా.. టెండర్లు పిలుస్తారా! | - | Sakshi
Sakshi News home page

రెన్యువల్‌ చేస్తారా.. టెండర్లు పిలుస్తారా!

Jun 2 2026 9:43 AM | Updated on Jun 2 2026 9:43 AM

ఆరు నెలలుగా ఉద్యమాలు..

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో వర్తక సంఘాన్ని రద్దు చేయాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు, యువకులు, నిరుద్యోగులు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు. దుకాణాలను రద్దు చేస్తే తమతోపాటు నిరుద్యోగులు, నిరుపేద కుటుంబాల వారు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతాయని దుకాణదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయశాఖ యాదగిరి కొండపైన వర్తక సంఘం దుకాణాలను రద్దు చేసి టెండర్లు వేస్తుందా.. రెన్యువల్‌ చేస్తుందా అనే అంశంపై చర్చనీయాంశమైంది.

అరవై ఏళ్ల క్రితం నుంచే..

యాదగిరి కొండపైన దేవాదాయశాఖ ఏర్పడకముందు అంటే 60 ఏళ్ల క్రితం నుంచే దుకాణాలు నడుస్తున్నాయి. మొదటగా 12 దుకాణాలను స్థానికులు కొందరు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు మారుతున్న నేపథ్యంలో వర్తక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని 114 దుకాణాలుగా విస్తరించారు. 2014 తరువాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండపైన దుకాణాలను తొలగించారు. రెండోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కొండకింద ఆధ్యాత్మిక వాడలో 120 దుకాణాల నిర్మాణం చేపట్టారు. దీంతో కొండపైన దుకాణాలు కోల్పోయిన తమకు కొండపైనే ఇవ్వాలని కోరడంతో 114కు గాను 10 దుకాణాలను విష్ణు పుష్కరిణి వద్ద కేటాయించారు. నాటినుంచి వర్తక సంఘం దుకాణదారులు 10 దుకాణాలను 114 మంది వర్తకులు నడిపిస్తున్నారు. వీరి వద్ద 500 మందికిపైగా ఉపాధి పొందుతున్నారు.

ప్రతినెలా రూ.14.16 లక్షలు చెల్లింపు

వర్తక సంఘం కొండపైన పది షాపులు ఏర్పాటు చేసి ప్రతినెలా రూ.14.16లక్షల వరకు దేవస్థానానికి అద్దె చెల్లిస్తుంది. ఏడాదికి రూ.1.69 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. ఈ దుకాణాలను రెండేళ్లకొకసారి రెన్యువల్‌ చేసుకుంటూ, దేవస్థానం పెంచిన 33 శాతం డబ్బు చెల్లిస్తుంటారు. ఆదివారం (మే 31) రెన్యూవల్‌ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొందరు కోర్టుకు వెళ్లడంతో దేవాదాయశాఖ మరో నెల రోజుల పాటు పొడిగించినట్లు తెలుస్తోంది.

యాదగిరి కొండపైన ఉన్న వర్తక సంఘం దుకాణాలను రద్దు చేసి ఓపెన్‌ టెండర్ల ద్వారా కేటాయించాలని ఆరు నెలలుగా యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి పరిరక్షణ కమిటీ ఉద్యమిస్తోంది. పలు శాఖల మంత్రులు, దేవాదాయశాఖ కమిషనర్‌కు వినతులు ఇచ్చారు. రెండు సార్లు హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇదిలా ఉంటే యాదగిరీశుడి ఆలయ అభివృద్ధిలో భాగంగా విలువైన భూములను వైటీడీఏకు అప్పగించామని, తమకు కొండపైన ఉపాధి కల్పనకు వర్తక సంఘం దుకాణాలు ఇవ్వాలని నిర్వాసిత గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ యాదగిరి కొండపైన వర్తక సంఘం రద్దు కోసం ఉద్యమాలు

ఫ ‘గుట్ట’లో యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు

ఫ ఉపాధి కోల్పోతామంటున్న దుకాణదారులు

ఫ దుకాణాల గడువు మరో నెల రోజులు పొడిగించినట్టు సమాచారం

Advertisement
 
Advertisement
Advertisement