ఆలేరు : ఆలేరు, భువనగిరి పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ప్రిన్సిపాళ్లు బదిలీ అయ్యారు. ఆలేరు ఐటీఐ ప్రిన్సిపాల్ బి.హరికృష్ణను మేడ్చల్ జిల్లా శామీర్‌పేట ఐటీఐకు, భువనగిరి ప్రిన్సిపాల్ జయను హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్ ఐటీఐకి బదిలీ చేశారు. గద్వాల ఐటీఐ ప్రిన్సిపాల్ ఎస్‌వీవీ సత్యనారాయణను ఆలేరుకు, శామీర్‌పేట ఐటీఐ ప్రిన్సిపాల్ లలితను భువనగిరికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
యాదగిరి క్షేత్రంలో
సుదర్శన హోమం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం శ్రీసుదర్శన నారసింహ హోమాన్ని ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా జరిపించారు. వేకువజామునే దేవాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలను చేపట్టారు. ముఖ మండపంలోని సువర్ణ ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజను సంప్రదాయంగా జరిపించారు. దక్షిణ దిశలోని ప్రథమ ప్రాకార మండపంలో భక్తులతో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాఢ వీధిలో అలంకారమూర్తులైన శ్రీస్వామి అమ్మవార్ల జోడు సేవను అర్చకులు ఊరేగించారు.
ఆలేరు బ్రిడ్జిపై
ప్రమాదాలను నివారిస్తాం
– ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి : ఆలేరులో బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు పక్కా చర్యలు తీసుకుంటామని భువనగిరి ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. ఆలేరు బ్రిడ్జిపై వరుస ప్రమాదాల నేపథ్యంలో ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి మాట్లాడారు. ఆలేరు బ్రిడ్జిపై బ్లాక్ స్పాట్ గాగుర్తించామన్నారు. ప్రధానంగా ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లు శనివారం గుర్తించినట్లు చెప్పారు. వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రమాదాలను అరికడతామన్నారు. బ్రిడ్జి సమీపంలో 11 ఎంఎం మందంతో రంబుల్ స్ట్రిప్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి వేళల్లో కూడా రోడ్డు స్పష్టంగా కనిపించేలా బ్రిడ్జిపై రేడియం లైటింగ్‌తో కూడిన రిఫ్లెక్టివ్ యూటర్న్, డైరెక్షన్ బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. బ్రిడ్జికి యూటర్న్‌ల వద్ద వాహనాలు ఢీకొనకుండా మధ్యలో ప్లాస్టిక్ బొల్లార్డ్స్‌ను అమరుస్తామన్నారు. అనంతరం శాశ్వత ప్రాతిపదికన సిమెంట్ డివైడర్ బ్లాకులను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. బ్రిడ్జి ప్రారంభమయ్యే చోట ఇరువైపులా వాటర్ పౌంటెయిన్ సర్కిల్స్‌ను ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు చెప్పారు. బ్రిడ్జిపై జరుగుతున్న ప్రమాదాల నివారణ విషయమై రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరై చర్చిస్తామని డీఎస్పీ చెప్పారు.


