నేటి నుంచి ఇంటర్‌ తరగతులు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్‌ తరగతులు

Jun 2 2026 9:43 AM | Updated on Jun 2 2026 9:43 AM

మొదటి రోజే పుస్తకాలిస్తాం..

భువనగిరి : జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు శనివారంతో వేసవి సెలవులు ముగిశాయి. 2026–27 విద్యా సంవత్సరానికి గాను సోమవారం నుంచి ఇంటర్‌ తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 11 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలు ఉండగా ఇప్పటికే గతనెల 12 నుంచి అధ్యాపకులు ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇంటింటా ప్రచారం నిర్విహించారు. ప్రథమ సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరంలో సుమారు 2వేలు మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

మారిన ఫస్టియర్‌ సిలబస్‌

కొత్త విద్యా సంవత్సరంలో తొలి రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే వాటిని గత నెల 29 కళాశాలలకు చేరవేశారు. కాగా ఈ సారి ప్రథమ సంవత్సరంలో సిలబస్‌ మారిన విషయం తెలిసిందే. దీంతో సిలబస్‌ మారిన పుస్తకాలు సైతం ఇంటర్మీడియట్‌ బోర్డు సిద్ధం చేసింది.

డిజిటల్‌ హంగులు..

విద్యార్థులను ఆకట్టుకునేలా చిత్రాలు, డిజిటల్‌ హంగులతో పుస్తకాలను ముద్రించారు. వాటిపై ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేస్తే వీడియో, ఆడియో ప్రత్యక్షమవుతాయి. వాటి ద్వారా పాఠాలు విని చదువుకోవచ్చు. ఈ సారి ప్రథమ సంవత్సరం నుంచే ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తుండడంతో వాటికి సంబంధించిన పాఠాలను పొదుపర్చారు. దీంతోపాటు కళాశాలల్లో మరమ్మతులు చేసి భవనాలకు వైట్‌, బ్లూ రంగులు వేసి తీర్చిదిద్దారు. డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేశారు.

బ్రేక్‌ ఫాస్ట్‌, మధ్యాహ్న భోజనం

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు తెలంగాణ బ్రేక్‌ ఫాస్ట్‌ పథకం కింద 5 రకాల టిఫిన్లు అందించనున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకో అల్పాహారం, మూడు రోజులు పాలు(150 మి.లీ.), మూడు రోజుల రాగిజావ అందించనున్నారు. అల్పాహారంలో ఇడ్లీ, మిల్లెట్‌ఇడ్లీ, ఉప్మా, దోసె, బోండాలు, పూరీలను అందించనున్నారు. బ్రేక్‌ ఫాస్ట్‌తోపాటు మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు.

ఫ తొలి రోజే పాఠ్యపుస్తకాల పంపిణీ

ఫ ఈ ఏడాది నుంచే బ్రేక్‌ ఫాస్ట్‌,

మధ్యాహ్న భోజనం అమలు

ఫ జిల్లాలో 11 ప్రభుత్వ

జూనియర్‌ కళాశాలలు

ఇంటర్‌ పాఠ్యపుస్తకాలను కళాశాలలకు సరఫరా చేశాం. సోమవారం నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మొదటి రోజే వాటిని పంపిణీ చేస్తాం. అన్ని కళాశాలల్లో మరమ్మతులు పూర్తి కావొచ్చాయి.

– సురేష్‌రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement