119 ఆలయాలు..
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ పరిధిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆలయాల సంఖ్యకు, పర్యవేక్షించే అధికారుల సంఖ్యకు పొంతన లేకపోవడంతో జిల్లాలోని ప్రముఖ దేవాలయాల్లో పరిపాలన అస్తవ్యస్తంగా మారుతోంది. అర్చకుల వేతనాలు, దేవుడి భూముల రక్షణ, భక్తుల సౌకర్యాల పర్యవేక్షణ వంటి కీలకమైన బాధ్యతలు ఇన్‌చార్జిల పాలనతో కుంటుపడుతున్నాయి.నల్లగొండ అసిస్టెంట్ కమిషన్ పరిధిలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాగ్రి భువనగిరి, జనగామ జిల్లాలో మొత్తం 119 ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక్కొక్కరు చొప్పున ఎండోమెంట్ అధికారులు ఉండాలి. కానీ ప్రస్తుతం 20 మంది అధికారులు మాత్రమే ఉన్నారు.
ఐదుకు పైగా ఆలయాలకు ఒకే అధికారి..
నిబంధనల ప్రకారం ప్రతి దేవాలయానికి ఒక పూర్తిస్థాయి ఎండోమెంట్ (కార్యనిర్వాహక) అధికారి ఉండాలి. కానీ ఉమ్మడి నల్లగొండతో పాటు జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కేవలం 20 మంది అధికారులు మాత్రమే ఉన్నారు. దీనితో ఒక్కో అధికారికి సగటున ఐదు నుంచి ఆరు ఆలయాలకు అదనపు బాధ్యతలు (ఇన్‌చార్జి ఈఓగా) నిర్వహించాల్సి వస్తుంది. దూరభారాలు ఉన్నప్పటికీ, వేర్వేరు ప్రాంతాల్లోని ఆలయాలను ఒకే అధికారి పర్యవేక్షించాల్సి రావడంతో వారు తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయి..
నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే ఆలయాల్లో పండగలు, ఉత్సవాల నిర్వహణ సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఆయాల దేవాలయాల పరిధిలో వేలాది ఎకరాల దేవాదాయ భూములు ఉన్నాయి. నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతో ఈ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కోర్టు కేసుల నిర్వహణ కూడా ఇబ్బందిగా మారింది. హుండీ లెక్కింపు, దాతల విరాళాలు, లీజుల వసూళ్లు వంటి ఆర్థిక లావాదేవీల ఆడిటింగ్ సకాలంలో జరగడం లేదు. ఆలయాల్లో పనిచేసే సిబ్బంది, అర్చకుల సమస్యలను పరిష్కరించే నాథుడే కరువయ్యాడు.
తక్షణ చర్యలు అవసరం..
ఒక అధికారి వారంలో ఒక్క రోజు కూడా పూర్తిస్థాయిలో ఒక ఆలయానికి కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల ఆలయ అభివృద్ధి పనులు, భక్తుల కనీస వసతుల కల్పన పూర్తిగా నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వం స్పందించి తక్షణమే పూర్తిస్థాయి అధికారులను నియమించాల్సి ఉంది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లో ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల వైభవాన్ని, ఆస్తులను కాపాడాలంటే ప్రభుత్వం స్పందించి దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న ఎండోమెంట్ అధికారుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవాదాయ శాఖకు సిబ్బంది కొరత
ఒక్కో అధికారికి ఐదు, ఆరు
ఆలయాల ఇన్‌చార్జి బాధ్యతలు
కష్టతరమవుతున్న ఆలయ
భూముల రక్షణ, ఉత్సవాల నిర్వహణ


