కరువు నేల నుంచి అన్నపూర్ణగా అవతరణ | - | Sakshi
Sakshi News home page

కరువు నేల నుంచి అన్నపూర్ణగా అవతరణ

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు

వరి సాగు పెరిగి..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. ఆపై ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి నూతన జిల్లాగా ఆవిర్భవించిన ‘యాదాద్రి భువనగిరి’ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఒకప్పుడు కరువు ఛాయలు అలుముకున్న ఈ నేల.. సాగునీటి రాకతో పచ్చని పొలాలతో అన్నపూర్ణగా అవతరించి రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడులు సాధిస్తోంది. మూడు రెట్లు పెరిగిన వరి సాగు విస్తీర్ణంతో వ్యవసాయం పండుగలా మారింది. దండుమల్కాపురం గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కుతో పారిశ్రామికంగా ఉపాధి అవకాశాలు ఊపందుకున్నాయి. బీబీనగర్‌ ఎయిమ్స్‌, నూతన మెడికల్‌ కళాశాలతో మెరుగైన వైద్యం, రీజినల్‌ రింగ్‌ రోడ్డు లాంటి మౌలిక వసతులతో జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో సాధించిన ఈ అద్భుత అభివృద్ధిపై ప్రత్యేక కథనం.

–సాక్షి, యాదాద్రి

రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి

ఎయిమ్స్‌తో మెరుగైన వైద్యం

ఇండస్ట్రియల్‌ పార్కుతో ఉపాధి జోరు

మారిన యాదాద్రి జిల్లా ముఖచిత్రం

జిల్లాల పునర్విభజనలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడింది. దీంతోపాటు చౌటుప్పల్‌ రెవెన్యూ డివిజన్‌, మోటకొండూరు, అడ్డగూడూరు మండలాలు నూతనంగా ఏర్పాటు చేశారు. ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్‌, మోత్కూరు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు చేశారు. హెచ్‌ఎండీఏ నిధులతో భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్‌ మున్సిపాలిటీల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి.

జిల్లాలో వరి సాగుకు సానుకూల పరిస్థితి ఉంది. నాలుగైదేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరిగాయి. కాళేశ్వరం నీటితో చెరువులు, కుంటలు నింపారు. అధిక దిగుబడిని ఇచ్చే హైబ్రిడ్‌ నాణ్యమైన వరి వంగడాలు వచ్చాయి. ప్రభుత్వం దగ్గరుండి ధాన్యం కొనుగోలు చేస్తోంది. వరిసాగుతో రైతుకు పనిభారం తక్కువైంది. ఎకరానికి సగటున 25 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. పెట్టుబడి పోను ఎకరాకు రూ.50 వేల లాభం వస్తోంది. మూసీ పరీవాహక ప్రాంతంలోని పోచంపల్లి, వలిగొండ మండలాల్లో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుడబడి వస్తోంది. తాజాగా పెరిగిన భూగర్భజలాలతో రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, సంస్థాన్‌నారాయణపురం, ఆత్మకూర్‌(ఎం) , ఆలేరు వంటి మండలాల్లో వరిసాగు విపరీతంగా పెరిగింది. జొన్న, కంది, పెసర, ఆముదం, సజ్జ ఇలా పలు రకాల ప్రత్యామ్నాయ పంటలు వేసేవారు. ప్రస్తుతం మెట్ట పంటల సాగు తగ్గింది.

మూడు రెట్లు

పెరిగిన వరి సాగు

2012లో వానాకాలంలో కేవలం 50 వేల ఎకరాలు, యాసంగిలో లక్ష ఎకరాల్లో వరిసాగు అయ్యేది. 2025 నాటికి సాగు విస్తీర్ణం పెరిగింది. వానాకాలం సాగు 2,98,937 ఎకరాలు. యాసంగిలో 3,14,621 ఎకరాలకు చేరుకుంది. అంటే దాదాపు మూడు రెట్లు సాగు విస్తీర్ణం పెరిగింది.

పెరిగిన వడ్ల దిగుబడి

2012లో వానాకాలం ధాన్యం ఉత్పత్తి లక్ష మెట్రిక్‌ టన్నులు కాగా యాసంగి ధాన్యం ఉత్పత్తి 2లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉంది. 2025వానాకాలం నాటికి 65,7661 మెట్రిక్‌ టన్నులు, యాసంగి ధాన్యం ఉత్పత్తి 6,92,166 మెట్రిక్‌ టన్నుల రికార్డు స్థాయికి చేరింది. ఽపెరిగిన ధాన్యం దిగుబడులను నిల్వ చేయడానికి జిల్లాలో మిల్లులు, గోదాములు సరిపోవడంలేదు. అధికారులు పొరుగు జిల్లాలకు జిల్లా ధాన్యం పంపిస్తున్నారు.

తుది దశకు నృసింహసాగర్‌

జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 11.39 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన నృసింహసాగర్‌ రిజర్వాయర్‌ తుది దశకు చేరింది. దీని ద్వారా యాదాద్రిభువనగిరి జిల్లాతోపాటు నల్లగొండలోని 256 చెరువులను నింపుతారు. తద్వారా 1,88,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ప్రజల మంచినీటి అవసరాలు,పరిశ్రమలకు నీటి సరఫరా చేస్తారు. గ్రావిటీ ద్వారా మల్లన్న సాగర్‌ నుంచి రెండేళ్ల క్రితమే బస్వాపూర్‌ రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో నింపడానికి అధికారులు సిద్ధమయ్యారు. కానీ నిధుల మంజూరులో జాప్యంతో పనులు నిలిచిపోయాయి. ఆలేరు, మోత్కూరు, మోటకొండూరు, గుండాల, ఆత్మకూర్‌ ఎం మండలాలకు సాగునీరందించే దేవాదుల పనులు సాగుతున్నాయి.బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల ఆధునీకరణ సాగుతోంది. కాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలో భాగంగా ఆలేరు నియోజకవర్గానికి సాగునీరందించే గంధమల్ల రిజర్వాయర్‌ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కేజీబీవీ, మోడల్‌స్కూల్స్‌, మూడు మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు కాగా 968 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఐదు జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలు ఏర్పాటు కాగా 2,356 మంది విద్యార్థులు చదువుతున్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూల్స్‌ మంజూరయ్యాయి. యాదగిరిగుట్టలో వేదపాఠశాల మంజూరైంది. సంస్కృత పాఠశాలను డిగ్రీ స్థాయికి పెంచారు.

అర్జీల పరిష్కారంలో కాలయాపన చేయొద్దు

Advertisement
 
Advertisement
Advertisement