ఫ ముఖ్య అతిథిగా హాజరుకానున్న శాసనమండలి చైర్మన్ గుత్తా
భువనగిరిటౌన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను మంగళవారం నిర్వహించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం వేసవికాలం దష్ట్యా వేడుకలను ఉదయం 9:30 గంటల లోపు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ వేడుకలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం7.45గంటలకు భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు.8గంటలకు కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.
ఏర్పాట్ల పరిశీలన
కలెక్టరేట్ ఆవరణలో వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ అనురాగ్ జయంతి.. అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి ఎండల తీవ్రత దష్ట్యా కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ తదితర అన్ని ఏర్పాట్లు పక్కాగా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట కలెక్టరేట్ ఏఓ అంజిరెడ్డి, భువనగిరి తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.
డీఈఓగా భిక్షపతి బాధ్యతల స్వీకరణ
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారిగా బి. భిక్షపతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నల్ల గొండ డీఈఓగా పనిచేసిన భిక్షపతి ఇక్కడికి బదిలీపై వచ్చారు. హన్మకొండ ఏడీగా ఉంటూ ఇక్కడ ఇన్‌చార్జి డీఈఓగా కె. సత్యనారాయణ 20నెలల పాటు విధులు నిర్వహించారు. ఇక్కడ ఏడీగా పనిచేస్తున్న ప్రశాంత్‌రెడ్డి కరీంనగర్ ఇన్‌చార్జి డీఈఓగా బదిలీ పై వెళ్లారు.
ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరిటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి అర్హులైన మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి ఎం. జయమ్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీహెచ్‌డీ చదవాలనుకునే ముస్లిం, క్రిస్టియన్ విద్యార్థులు ఈ పథకానికి అర్హులని ఆమె తెలిపారు. అభ్యర్థులు 2026 జనవరి 01 నుంచి 2026 జూన్ 30 లోపు విదేశీ విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్ పొంది ఉండాలని, వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ.5లక్షల లోపు ఉండాలని స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా ఎంపికై న విద్యార్థులకు రూ.20లక్షల స్కాలర్‌షిప్‌తో పాటు, విమాన ప్రయాణ ఖర్చుల నిమిత్తం అదనంగా రూ.60 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ www.tela nganaepass.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, 2026 జూన్ 30 సాయంత్రం 5.00 గంటల లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు యాదాద్రి కలెక్టరేల్‌లోని మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చని వివరించారు.
రాజీవ్ యువ వికాస పథకంపై స్పష్టమైన హామీ ఇవ్వాలి
భువనగిరిటౌన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాస పథకం అమలుపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కమిటీ సభ్యులు బండారు శ్రవణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిందని విమర్శించారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు రత్నం శ్రీకాంత్, సుందరయ్య, రియాజ్ పాల్గొన్నారు.


