భువనగిరిటౌన్ : నిరుపేదల సొంతింటి కల సాకారమైంది. సొంత గూటికి చేరుకున్న లబ్ధిదారుల కళ్లల్లో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి. భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని 2, 7, 8 వార్డుల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను సోమవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారుల కుటుంబాలకు ప్రజాప్రతినిధులు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నిరుపేదలకు ఆత్మగౌరవంతో కూడిన జీవనాన్ని అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం సాగుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు అందజేయడమే లక్ష్యమన్నారు. భువనగిరి మునిసిపాలిటీ పరిధిలో మొదటి దఫా కింద మొత్తం 531 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసుకున్న 300కు పైగా గృహప్రవేశాలు చేశారని వివరించారు. వేడుకలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజులవెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.డి. అవేజ్ చిస్తి, కౌన్సిలర్లు పోలిశెట్టి అనిల్ కుమార్, కుక్కదూగ పద్మ, ఎం.డి తాహెరా, మున్సిపల్ కమిషనర్ కె. చంద్రప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.


