అబ్బురపరిచే వైవిధ్యం..
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రసిద్ధ చేనేత వస్త్రాలు హైదరాబాద్‌లో ప్రదర్శించనున్నారు. నగర వినియోగదారులకు, చేతివృత్తి కళాకారులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు జూన్ 5, 6, 7 తేదీల్లో హైటెక్ సిటీలో మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో, జిల్లా చేనేత జౌళిశాఖ సమన్వయంతో ‘థ్రెడ్. పోచంపల్లి’ థీమ్‌తో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు.
ఒకే వేదికపై 100 స్టాల్స్..
చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ ఎగ్జిబిషన్‌లో మొత్తం 100 ప్రత్యేక స్టాల్స్ ఉండనున్నాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, నేషనల్ అవార్డు గ్రహీతలు, సంత్ కబీర్, కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు గ్రహీతలు, ప్రొడ్యూసర్ కంపెనీలు, ఎంపిక చేసిన మాస్టర్ వీవర్స్ నేరుగా ఈ స్టాల్స్‌ను నిర్వహించనున్నారు. అంతేకాకుండా స్వయం సహాయక సంఘాలతో గ్రామీణ వంటకాల రుచులను ఆస్వాదించే స్టాల్స్ సైతం ఏర్పాటు చేస్తున్నారు.
దారంపైన డిజైన్ వేసి.. వస్త్రం నేసి
దారంపైన డిజైన్ వేసి మగువల మనసు దోచే ఆకర్షణీయమైన చేనేత వస్త్రాలను రూపొందించే కళ ఒక్క పోచంపల్లి చేనేత కళాకారులకే సొంతం. డిజైన్‌కు అనుగుణంగా దారంపైన రబ్బరుచుట్టి (టై), రంగులద్ది (డై) చేతి మగ్గాలపై రూపొందించిన ఇక్కత్ వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా పేర్గాంచాయి. ఎంతో ప్రత్యేకమైన పోచంపల్లి ఇక్కత్ కళకు 2003లో భౌగోళిక గుర్తింపు (జీఐ) కూడా వచ్చింది. వారసత్వంగా వస్తున్న చేనేతలో ఇక్కడి కళాకారులు కాలానుగుణంగా వస్తున్న మార్పులు, అభిరుచులకు అనుగుణంగా అనేక ప్రయోగాలు చేస్తూ, ఆధునితను జోడిస్తూ చేనేత పరిశ్రమను సజీవంగా నిలుపుతున్నారు. దాంతో భూదాన్‌పోచంపల్లి కేంద్రంగా యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణలోనే చేనేతలకు పెట్టింది పేరు. జిల్లా వ్యాప్తంగా 15 వేల కుటుంబాలు చేనేతవృత్తిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలా చేతివృత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తూ తోటి కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నందుకు యునెస్కో అనుబంధ సంస్థ ప్రపంచ పర్యాటక సంస్థ 2021లో భూదాన్‌పోచంపల్లికి ఉత్తమ టూరిజం విలేజ్‌గా గుర్తించి అంతర్జాతీయ అవార్డు అందజేసింది.
‘థ్రెడ్. పోచంపల్లి’ థీమ్‌తో ఎగ్జిబిషన్
ఫ జూన్ 5 నుంచి 7 వరకు ప్రదర్శన
ఫ ఒకే వేదికపై 100 స్టాల్స్
ఫ నేరుగా విక్రయించనున్న
జాతీయ, రాష్ట్ర అవార్డు గ్రహీతలు, మాస్టర్ వీవర్స్
ఫ ప్రత్యక్షంగా మగ్గాల ప్రదర్శన,
తెలంగాణ గ్రామీణ రుచులు
పోచంపల్లి, చౌటుప్పల్, కొయ్యలగూడెం, పుట్టపాక, సంస్థాన్ నారాయణపురం, రామన్నపేట, ఆలేరు తదితర ప్రాంతాల నేతన్నలు నేసిన అద్భుతాలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు, పుట్టపాక శ్రీతేలియా రుమాళ్లుశ్రీ, సిల్క్, కాటన్ వస్త్రాలు, షర్టింగ్, డ్రెస్ మెటీరియల్స్, దుపట్టాలు, బెడ్‌షీట్స్, దివాన్ సెట్స్, హోమ్ ఫర్నీషింగ్ వస్తువులతో పాటు చిన్న పిల్లల లెహంగాలు, హ్యాండ్‌పర్సులు ఇక్కడ కొనుగోలు చేయొచ్చు. కేవలం వస్త్రాల విక్రయమే కాకుండా, ఇదొక సజీవ సాంస్కృతిక వేదికగా అలరించనుంది. ఎగ్జిబిషన్ ప్రాంగణంలో సంప్రదాయ మగ్గాలను ఏర్పాటు చేసి, దారానికి రంగులద్ది (టై అండ్ డై) వస్త్రం నేసే క్లిష్టమైన ప్రక్రియను సందర్శకులకు ప్రత్యక్షంగా చూపించనున్నారు.


