నల్లగొండ : ఆ చిన్నారులకుకి ఆకలి దప్పిక తెలియదు.. మాటలు రావు... కూర్చోలేరు, నిలబడలేరు. జన్యుపరమైన వ్యాధితో 14 ఏళ్లుగా ఆ చిన్నారులు మంచానికే పరితమయ్యారు. రూ.లక్షలు ఖర్చు చేసినా రోగం నయం కాలేదని, కుటుంబ పోషణ కూడా భారమై పోయిందని, మానవతా దృక్పథంతో ఆదుకోవాలని ఆ చిన్నారుల తల్లిదండ్రులు కలెక్టర్‌ను వేడుకున్నారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం కలెక్టరేట్‌లో వృద్ధులకు, దివ్యాంగులకు నిర్వహించిన ప్రత్యేక ‘ప్రజావాణి’ కార్యక్రమానికి.. నార్కట్‌పల్లి మండలం చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన వల్కి శంకర్–మధుమతి దంపతులు తమ కుమారుడు మణివర్షిత్(14), కుమార్తె ప్రేమాన్విత(11)లను తీసుకుని వచ్చి తమ గోడును కలెక్టర్‌కు విన్నవించారు. తమ ఇద్దరు పిల్లలు జన్యుపరమైన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని, మంచానికే పరిమితమయ్యారని చెప్పారు. ఏదీ అడగలేరు.. చెప్పలేరని, సమయానికి అన్నం పెట్టడం. పడుకోబెట్టడం అన్నీ తామే చేస్తున్నామని చెప్పారు.
రూ.18 లక్షలు ఖర్చు చేసినా నయం కాలే...
బాబు పుట్టిన 9 నెలల నుంచి వైద్యం కోసం తిరుగుతునే ఉన్నాం. ఆ తర్వాత మూడేల్లకు పాప పుట్టింది. పాప కూడా జన్యుపరమైన వ్యాధితో పుట్టింది. ఆ ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఆసుపత్రులు తిప్పి వైద్యం చేయించాం. ఉన్నదంతా వైద్యానికి ఖర్చు చేశాం. 18 లక్షలు అయింది. అయినా పిల్లల ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. ఒకరైనా మాటలు వస్తాయి నడవగలరని అనుకున్నాం. డాక్టర్లు కూడా వారి పరిస్థితి చూసి మేమేమీ చెప్పలేమని అంటున్నారు. సమయానికి తినిపించడం, తాగించడం, మందులు వేయడం, పరిశుభ్రత చేయించడం మేమే చేస్తున్నాం. 24 గంటలు పిల్లల సంరక్షణలో ఒకరు ఉంటున్నాం. మొన్నటి వరకు మా అమ్మ ఉండేది. ఆమె కూడా చనిపోయింది. దీంతో నా భార్య మధుమతి ఇద్దరు పిల్లలను ఇంట్లో ఉండి చూసుకోవాల్సి వస్తుంది. నేను పార్టు టైం డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. కిరాయి దొరికితే డబ్బు వస్తుంది. లేకపోతే లేదు. కుటుంబ గడవని పరిస్థితి ఉంది. పిల్లల మందులకు కూడా డబ్బులులేవు అంటూ కలెక్టర్ ముందు తన దయనీయ స్థితిని చెప్పుకుని శంకర్ కన్నీటి పర్యంతమయ్యాడు. తమ పరిస్థితి పరిశీలించి ఏదేని పని చేసేందుకు తనకు ఉపాధి కల్పించాలని వేడుకున్నాడు.
పిల్లలిద్దరూ మంచానికే పరిమితం
ఫ జన్యుపరమైన వ్యాధితో
బాధపడుతున్న
చిన్నారులు
ఫ రూ.లక్షలు ఖర్చు చేసినా
నయం కాని రోగం
ఫ ఆదుకోవాలని కలెక్టర్‌ను
వేడుకున్న తల్లిదండ్రులు


