యాదగిరిగుట్ట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో హిందుత్వ మతోన్మాద విధానాలు అమలు చేస్తోందని ఎన్‌పీఆర్‌డీ (నేషనల్ ప్లాట్‌ఫామ్ఫ్‌ర్ ద రైట్స్ ఆఫ్ ద డిసెబుల్) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నంభు రాజన్ ఆరోపించారు. యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్న వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ శిక్షణ తరగతుల్లో శనివారం రెండవ రోజు ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కాకుండా సంపన్నుల కోసం పని చేస్తుందన్నారు. ప్రజల సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కోసం ఉన్న అనేక చట్టాలను రద్దు చేయడంతో పాటు సవరణలు చేస్తుందని, చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నిధులు కేటాయించకుండా అందరికి యూడీఐడీ కార్డులను ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా 15 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వికలాంగులకు సహాయ పరికరాల పంపిణీ కోసం ఉన్న పథకానికి నిధులు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్ కార్డు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వికలాంగులకు ఎందుకు రిజర్వేషన్ అమలు చేయడం లేదన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, రాష్ట్ర కోశాధికారి వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపేందర్, సహాయ కార్యదర్శి రాజు, భువనగిరి జిల్లా అధ్యక్షుడు సూరపంగ ప్రకాష్, కోశాధికారి లలితలతో వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ ఎన్‌పీఆర్‌డీ జాతీయ వర్కింగ్
ప్రెసిడెంట్ నంభు రాజన్


