ప్రవేశ ద్వారం వద్ద నుంచే..
బ్లాక్ స్పాట్‌గా గుర్తించాలి
ఆలేరు ఫ్లైఓవర్‌పై తరచూ ప్రమాదాలు
ఫ వెలగని లైట్లు.. వంతెనపై చీకట్లు
ఫ ఐదు నెలల్లోనే ఒకేచోట మూడు ప్రమాదాలు.. ముగ్గరు బలి
ఫ భయాందోళనలో వాహనదారులు
ఆలేరు : ఆలేరు పట్టణంలోని ఫ్లై ఓవర్.. ఇప్పుడు డేంజర్ స్పాట్‌గా మారింది. తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ వాహనదారుల ప్రాణాలను బలితీసుకుంటోంది. ప్రమాదకర మలుపులు కలిగిన ఈ వంతెనపై రాత్రి వేళల్లో ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు హడలిపోతున్నారు.
రెండు కిలోమీటర్ల పొడవునా వంతెన..
ఆలేరు పట్టణం మంతపురి రోడ్డు నుంచి రఘునాథపురం రోడ్డు వరకు దాదాపు 2 కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లై ఓవర్‌లోని ప్రమాదకర మలుపులు ఉన్నాయి. వంతెనపై వెలుతురు, సూచిక బోర్డులు లేని కారణంగా ప్రమాదాలకు జరుగుతున్నాయి. వంతెనపైకి వచ్చిన ప్రతి వాహనదారుడు భయం భయంగానే ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒకే స్పాట్.. మూడు ప్రమాదాలు
ఫ్లై ఓవర్‌పై ఉన్న మలుపు వద్ద ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలల్లో ముగ్గరు దుర్మరణం చెందారు. రెండు నెలల క్రితం మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేస్తున్న తన తల్లిని రైల్వేగేట్ చౌరస్తాలో వదిలిపెట్టి, తిరిగి ఇంటికి వెళుతున్న పట్ణణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఉమేష్ (27)ను కర్నాటకకు చెందిన కారు ఢీకొట్టడంతో వంతెనపై నుంచి కింద పడి మృతి చెందాడు. అలాగే యాదగిరిగుట్ట మండలం కమటంగూడెంకు చెందిన రైతు శ్రీనాథ్(35) మలుపు వద్ద జారిపడి మరణించాడు. తాజాగా నాలుగు రోజుల కిత్రం ఆలేరు ఐటీఐలో అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారిగా పనిచేస్తున్న సుంకరినేని శ్రీనాథ్(40)ను కర్నాటకకు చెందిన వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. ఈవంతెన మలుపు వద్ద, రఘునాథపురం నుంచి వచ్చే వాహనాలు, పోచమ్మ గుడి నుంచి వచ్చే వాహనాలు కనబడక వంతెన రోడ్డు వద్ద ఢీకొట్టుకున్న ఘటనలో పదిమంది వరకు గాయపడ్డారు. అయినా అధికారులు నివారణ చర్యలు చేపట్టడం లేదు.
చీకటి కమ్మితే భయం మొదలు..
వంతెన పొడవునా వీధిదీపాలు సక్రమంగా వెలగకపోవడంతో రాత్రి వేళ్లలో అంధకారం అలుముకుంటోంది. ఎదురుగా వస్తున్న వాహనాలు చివరి క్షణం వరకు కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వంతెనపై మలుపు వద్ద పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉందంటున్నారు వాహనదారులు.
అతివేగం.. మరో కారణం
ఈ వంతెన మీదుగా రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రఘునాథపురం, జనగాం, వరంగల్, యాదగిరిగుట్ట, కొలనుపాక, సిద్ది పేట, ఆలేరు పట్టణం (పోచమ్మగుడి)లోకి వెళ్లే వాహనాలకు ఈ ఫ్లై ఓవర్ ప్రధాన మార్గం. ఈ వంతెనపై గంటకు సుమారు 20కి.మీ. వేగ పరిమితి ఉన్నా పలువురు వాహనదారులు పట్టించుకోవడం లేదు. అతివేగంతోపాటు మద్యం సేవించి వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు మరో కారణమవుతోంది.
అధికారులూ... మేల్కోంటారా?
మలుపుల వద్ద రేడియం సూచిక బోర్డులు, వంతెన ప్రారంభం, ముగింపు, మధ్యలో స్పీడ్ బ్రేకర్లు, అవసరమైతే డివైడర్లను ఏర్పాటు చేయాలి. వంతెన ప్రవేశం వద్ద ఫౌంటెయిన్ సర్కిల్ నిర్మించి లైటింగ్ ఏర్పాటు చేయాలి. వంతెన ప్రవేశం, చివరలో స్టాపర్లు ఏర్పాటు చేయాలి. వీటిని ఏర్పాటు చేయ డం ద్వారా ప్రమాదాల నియంత్రణకు ఆస్కారం ఉంది. ఇకనైనా అధికారులు మేల్కొంటారో లేదో చూడాలి.
మంతపురి రోడ్డు వైపు వంతెన ప్రవేశం వద్ద ఎలాంటి హెచ్చరిక/సూచిక బోర్డులు లేవు. దాంతో వంతెనపైకి ఎక్కే, దిగే వాహనాలలు ఒకదానికొకటి సరిగా కనిపించని పరిస్థితి. ఈ క్రమంలో ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందోనన్న భయం వాహనదారులను వెంటాడుతోంది.
నిత్యం ప్రమాదాలు జరుగుతున్న ఈ ఫ్లై ఓవర్‌ను బ్లాక్‌స్పాట్‌గా గుర్తించి, ప్రత్యేక రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలి. పూర్తి స్థాయిలో వీధిదీపాలు వెలిగేలా చూడాలి. పోలీసు, మున్సిపల్, ట్రాఫిక్ అధికారులు దీనిపై దృష్టిపెట్టాలి.
– తునికి దశరథ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి


