సాక్షి, యాదాద్రి : జలాల వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. శనివారం ఆయన అధ్యక్షతన కలెక్టరేట్‌లో 2025–26 నీటి సంవత్సరానికి భూగర్భ జలాల లభ్యత అంచనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సగటు కంటే 65 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ జనవరి నుంచే నీటి సమస్యలు మొదలయ్యాయని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత కోసం భూగర్భ జలాలు నవంబర్‌లో 3 మీటర్లు, మే మాసంలో 5 మీటర్ల లోతులో ఉండేలా చూడాలన్నారు. బోర్ల కింద రెండో పంటగా వరి సాగును తగ్గించాలన్నారు. అనంతరం భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జ్యోతి కుమార్ పీపీటీ ద్వారా వివరాలు వెల్లడించగా, జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2024–25 భూగర్భ జలాల అంచనా నివేదికను ఆవిష్కరించారు. జిల్లా భూగర్భ జలాల అంచనా కమిటీ మొదటి సమావేశానికి వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్, అటవీ, నీటిపారుదల, ప్రణాళిక శాఖల అధికారులు హాజరయ్యారు.


