గుండాల : కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించకుండానే తరుగు పేరుతో కోత విధించిన కేంద్ర ఇన్‌చార్జి, మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుండాల మండల కేంద్రంలో శుక్రవారం రైతులు రోడ్డుపై ధాన్యాన్ని పోసి నిప్పంటించి ధర్నా చేశారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతు మేకల చంద్రయ్య ధాన్యాన్ని 382 బస్తాలు తూకం వేసినట్లు చెప్పారు. ఆ ధాన్యాన్ని మిల్లుకు తరలించకుండానే సెంటర్ ఇన్‌చార్జి 10 బస్తాలను తరుగు పేరు మీద తీసి వేసి 372 బస్తాలను లారీలోకి ఎగుమతికి ట్రక్ షీట్‌లో నమోదు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో రైతులు మేకల సోమయ్య, శ్రీరాముల ఉదయ్, బయ్య లింగస్వామి, యాకస్వామి, మాదరబోయిన రాంమల్లు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


