శిక్షణలో ఎంతో నేర్చుకున్నాను
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరం 16 రోజులుగా విజయవంతంగా కొనసాగుతోంది. సాధారణంగా వేసవి సెలవుల్లో విద్యార్థులు అమ్మమ్మ, నానమ్మల ఇళ్లకు వెళ్తుంటారు. కానీ, ఈసారి విద్యార్థినుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ శిబిరానికి బాలికల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రధానంగా లలిత కళలు, క్రీడలు, స్పోకెన్ ఇంగ్లిష్ వంటి అంశాలపై నిర్వహిస్తున్న ఈ శిబిరంలో సుమారు వంద మంది విద్యార్థినులు శిక్షణ పొందుతున్నారు. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ తరగతులు జరుగుతున్నాయి. శిబిరానికి వచ్చే విద్యార్థినులకు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సహకారంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం చల్లని పెరుగు అన్నం, తాగునీరు అందిస్తున్నారు. ఈ శిబిరాన్ని మండల విద్యాధికారి ధర్మానాయక్ పర్యవేక్షిస్తుండగా, ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఇన్‌చార్జ్ కృష్ణకాంత్‌నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న విద్యార్థుల
చిత్రకళా నైపుణ్యం
చిత్రకళా ఉపాధ్యాయురాలు ఇనుగుర్తి రేణుక ఆధ్వర్యంలో విద్యార్థినులు అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. కేవలం డ్రాయింగ్ బేసిక్స్ మాత్రమే కాకుండా.. పెన్సిల్ వర్క్, వాటర్ కలర్స్ ఉపయోగించి ప్రకృతి దృశ్యాలు, సామాజిక అంశాలపై దాదాపు 150కి పైగా చిత్రాలను గీశారు. చిత్రలేఖనంతో పాటు పేపర్ క్రాఫ్ట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విద్యార్థినుల చేత బ్యాడ్జీలు, ఎన్విలాప్ కవర్లు, పెన్ స్టాండ్లు, పర్సులు, బ్యాగులు, ఒరిగామి బొమ్మలను తయారు చేయిస్తున్నారు. ఈ సృజనాత్మక ప్రదర్శనను ఎడ్యుకేషన్ స్పెషల్ ఆఫీసర్ జూలకంటి వెంకటేశ్వర్‌రెడ్డి సందర్శించి, బాలికల ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు.
చిత్రకళా నైపుణ్యాలను నేర్చకున్నవి సాధన చేస్తూ చదువుల్లో అవసరమయ్యే డ్రాయింగ్, సైన్స్ బొమ్మలను చాలా సులువుగా వేయొచ్చు. క్రమం తప్పకుండా ఈ శిక్షణకు సమయానికి అనుగుణంగా వస్తున్నాను. దీని వలన ఎంతో ఉపయోగకరమైన చిత్రాలను వేస్తున్నాను.
– చంద్రిక, 7వ తరగతి,
ఎస్‌పీఆర్ స్కూల్, మిర్యాలగూడ
ఫ వేసవి శిబిరంలో ఉత్సాహంగా సాగుతున్న చిత్రలేఖన శిక్షణ
ఈ వేసవి శిక్షణలో ఎంతో నేర్చుకున్నాను. ప్రధానంగా బేసిక్స్, కలర్స్ వేయడం, షేడింగ్ వంటి వాటిని నేర్చుకున్నా. టీచర్ కూడా అదే రీతిలో బేసిక్స్‌ను నేర్పించారు.
– భార్గవి 6వ తరగతి, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మిర్యాలగూడ


