పైపులైన్లు దగ్ధం
మద్దిరాల : వరికోతల అనంతరం మిగిలిన వరికొయ్యలకు పెట్టే నిప్పు నిరుపేదల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఎండల తీవ్రతకు తోడు ఈదురుగాలులు వీస్తుండటంతో ఈ మంటలు కిలోమీటర్ల మేర వ్యాపించి పొలాల్లోని మోటార్లు, వైర్లు, పైపులు, గడ్డివాములతో పాటు నివాసాలను కూడా బూడిద చేస్తున్నాయి. ఇటీవల మద్దిరాల, కుంటపల్లి, కుక్కడం, రెడ్డిగూడెం గ్రామాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. తాజాగా శుక్రవారం అక్కమ్మకుంట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వరికొయ్యలకు పెట్టిన నిప్పు కుక్కడం గ్రామ పరిధిలోని దేవాళ్లతండాలో పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది.
వ్యాపించిన మంటలు
దేవాళ్లతండా సమీపంలోని అక్కమ్మకుంట వద్ద గుర్తుతెలియని వ్యక్తులు వరికొయ్యలకు నిప్పు పెట్టారు. తీవ్రమైన ఎండ, గాలి తోడవడంతో ఆ మంటలు ఉధృతంగా మారి, పొలాల నుండి కిలోమీటరు మేర విస్తరించి నేరుగా దేవాళ్లతండాపైకి దూసుకొచ్చాయి. తండావాసులు ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో ఐదు పూరిగుడిసెలకు నిప్పంటుకోగా.. మూడు గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మరో రెండు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం తప్పినప్పటికీ.. గుడిసెల్లో ఉన్న బియ్యం, బట్టలు, టీవీలు, ఫ్యాన్లు మరియు దాచుకున్న నగదు పూర్తిగా కాలిపోవడంతో తండావాసులు రోడ్డున పడ్డారు. సైదులు అనే రైతు రూ.15వేలు పెట్టి ఇటీవలే పైపులు తీసుకోగా అవికూడా మంటలకు పూర్తిగా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఫ వరికొయ్యలకు నిప్పు పెట్టడంతో దేవాళ్లతండాకు వ్యాపించిన మంటలు
ఫ దగ్ధమైన ఐదు పూరిగుడిసెలు
ఫ నగదు, సామగ్రి కాలి నిరాశ్రయులైన గిరిజనులు
కేతేపల్లి: వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు ఎగిసిపడి అక్కడే ఉన్న పైప్‌లైన్లు కాలిపోయాయి. ఈసంఘటన కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కొత్తపేట గ్రామం నుంచి కొర్లపహాడ్ గ్రామానికి వెళ్లే డొంకదారి వెంట శుక్రవారం వరికొయ్యలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈదురు గాలులతో దాదాపు ఎకరాల భూమికి మంటలు వ్యాపించాయి. దీంతో పలువురు రైతులకు చెందిన పైపులైన్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న నకిరేకల్, సూర్యాపేట ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.


