దొంగతనం కేసులో ఆటోడ్రైవర్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

దొంగతనం కేసులో ఆటోడ్రైవర్‌ అరెస్ట్‌

May 30 2026 8:47 AM | Updated on May 30 2026 8:47 AM

18 గ్రాముల బంగారు పుస్తెలతాడు, ఆటో స్వాధీనం

సూర్యాపేటటౌన్‌ : మహిళను ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి బంగారు పుస్తెలతాడు దొంగత నం చేసిన ఆటో డ్రైవర్‌ను సూర్యాపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి 18 గ్రాముల బంగారు పుస్తెలతాడు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ వెంకటయ్య కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 27న చివ్వెంల మండల కేంద్రానికి చెందిన ధనలక్ష్మి పట్టణంలోని ఖమ్మం అండర్‌పాస్‌ వద్ద చివ్వెంల వెళ్లేందుకు వాహనం కోసం ఎదురుచూస్తోంది. ఆటో డ్రైవర్‌ ఆమెను ఎక్కించుకుని ఖమ్మం రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న 18 గ్రాముల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలం పరిసరాల్లో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి ఆటో నంబర్‌ను గుర్తించారు. దాని ఆధారంగా ఆత్మకూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన భూతం మహేష్‌ను నిందితుడిగా గుర్తించారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో అద్దె ఇంట్లో ఉన్న మహేష్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

మహిళ మెడలో గొలుసు చోరీకి యత్నం

మిర్యాలగూడ: మండల కేంద్రంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లేందుకు యత్నించారు. సదరు మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వస్తున్నట్లు గమనించిన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన దామరచర్ల మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండల కేంద్రానికి చెందిన పడిగపాటి నారాయణమ్మ అనే మహిళ శుక్రవారం సాయంత్రం తన ఇంటి సమీపం నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు ఆమెను అనుసరిస్తూ వచ్చారు. వారిలో బైక్‌ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్‌ ధరించగా, వెనుక కూర్చొన్న మరో వ్యక్తి మంకీ క్యాప్‌ ధరించి ఉన్నాడు. నారాయణమ్మ దగ్గరకు రాగానే వారు ఒక్కసారిగా బైక్‌ ఆపారు. బైక్‌ వెనుక కూర్చొన్న వ్యక్తి కిందకు దిగి నారాయణమ్మ మెడలోని బంగారు గొలుసును దొంగలించడానికి ప్రయత్నించాడు. ఈ పెనుగులాటలో నారాయణమ్మ కిందపడిపోయి గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారు ఘటన స్థలానికి రావడంతో ఇద్దరు దుండగులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు నారాయణమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయమై నారాయణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement