వికలాంగుల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

వికలాంగుల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం

May 30 2026 8:47 AM | Updated on May 30 2026 8:47 AM

యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (టీవీసీసీ) చైర్మన్‌ ముత్తినేని వీరయ్య అన్నారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం వికలాంగుల చట్టాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర సదస్సును సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ అధ్యక్షతన యాదగిరిగుట్టలో ప్రారంభించారు. విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల ప్రారంభ సూచికంగా సంఘం జెండాను వెంకట్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ.. కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో 5 శాతం రిజర్వేషన్‌ అమలవుతోందని తెలిపారు. రూ.3.75 కోట్ల నిధులతో 80వేల మంది వికలాంగులతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి వికలాంగులకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 4,372 మంది వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. రెండో దఫా ఇందిరమ్మ ఇళ్లలో 5 శాతం వికలాంగులకు కేటాయించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జూన్‌ 2 నుంచి రాష్ట్రంలో 2 లక్షల మందికి చేయూత పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, సంఘం రాష్ట్ర కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌, భువనగిరి జిల్లా అధ్యక్షుడు సూరపంగ ప్రకాష్‌, కార్యదర్శి ఉపేందర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.స్వామి, కోశాధికారి లలిత, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరాజు గౌడ్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వెంకటేష్‌, పీఎన్‌ఎం జిల్లా కార్యదర్శి ముత్యాలు, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ రాజు, యశోద, నాగలక్ష్మి, కాషప్ప తదితరులు పాల్గొన్నారు.

ఫ టీవీసీసీ చైర్మన్‌ ముత్తినేని వీరయ్య

Advertisement
 
Advertisement
Advertisement