హుజూర్‌నగర్ : కరెంట్ వైరు చోరీ కేసులో ఆరుగురిని గరిడేపల్లి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.2.40లక్షల విలువైన వైరు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. హుజూర్‌నగర్‌లోని తన కార్యాలయంలో సీఐ చరమంద రాజు ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్‌తో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. గరిడేపల్లి మండలం కొత్తూరు తాళ్ల్లమల్కాపురం గ్రామానికి చెందిన దొంతిరెడ్డి నాగిరెడ్డి సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. మండలంలోని కీతవారిగూడెం నుంచి ముత్యాల్‌నగర్ వరకు సుమారు 16 కిలో మీటర్ల మేర 33 కేవీ విద్యుత్ లైన్ వేసేందుకు కాంట్రాక్ట్ పొందాడు. వైరు లాగే పనుల కోసం ఆత్మకూర్ మండలం మంగల్‌తండాకు చెందిన లూనవత్ అశోక్, లూనవత్ సైదులు, లూనవత్ నెహ్రూ, లూనవత్ సురేశ్, ధరావత్ ప్రసాద్, చివ్వెంల మండలం మంగల్ తండాకు చెందిన ధరావత్ ప్రసాద్‌లను పెట్టుకున్నాడు. వారు దురాశతో సుమారు 10 రోజులక్రితం కరంట్ వైర్ లాగుతున్న క్రమంలో 217 కేజీల 33 కేవీ వైర్‌ను వాగులో దాచి పెట్టారు. ఈవిషయం దొంతిరెడ్డి నాగిరెడ్డికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం గరిడేపల్లి ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్ పొనుగోడు ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో వైరు తరలిస్తూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ 2.40 లక్షల విలువ గల వైర్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి, కోర్టుకు రిమాండ్ చేసినట్లు సీఐ తెలిపారు.
ఫ రూ.2.40లక్షల విలువైన వైరు,
ఆటో స్వాధీనం


