భువనగిరిటౌన్ : యువజన, విద్యా రంగాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. గురువారం భువనగిరిలోని సీపీఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్ అధ్యక్షతన జరిగిన ఆ సంఘం జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా కోట్లాది ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దుతో యువత తీవ్ర నిరాశలో ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతి, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే అందించాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, నాయకులు కొండూరి వెంకటేష్, ఎండీ. నయీమ్, నర్సింహా చారి, శోభన్ బాబు, ఆనంతుల నర్సింహా, కంబాల రాజు, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.


