అడ్డగోలుగా హోర్డింగ్‌లు! | - | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా హోర్డింగ్‌లు!

May 29 2026 8:10 AM | Updated on May 29 2026 8:10 AM

మార్గదర్శకాలు రాగానే సర్వే చేస్తాం

హోర్డింగులు, భారీ ఫ్లెక్సీల విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలు రాగానే ప్రత్యేక సర్వే నిర్వహిస్తాం. మున్సిపాలిటీకి రావాల్సిన పన్నుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించం. నాణ్యత లేకుండా, ప్రమాదకరంగా ఉన్న బోర్డులను గుర్తించి వాటిని తక్షణమే తొలగించేలా చర్యలు తీసుకుంటాం.

– కె.చంద్రప్రకాశ్‌రెడ్డి,

మున్సిపల్‌ కమిషనర్‌, భువనగిరి

భువనగిరిటౌన్‌ : మున్సిపాలిటీల్లో కొందరు వ్యాపారులు నిబంధనలకు పాతరేస్తూ తమ వ్యాపార ప్రకటనల కోసం హోర్డింగులు, డిజిటల్‌ ఎల్‌ఈడీ స్క్రీన్లు, భారీ ఫ్లెక్సీలు అడ్డగోలుగా ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్‌ పరిధిలో నిబంధనల ప్రకారం బోర్డులు ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. వ్యాపార ప్రకటనల పేరుతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా.. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి.

రెండేళ్లుగా నయాపైసా పన్ను లేదు..

జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్ట, మోత్కూరు, భూదాన్‌ పోచంపల్లి, చౌటుప్పుల్‌, ఆలేరు మున్సిపాలిటీల్లో 2024 సంవత్సరం నుంచి మున్సిపాలిటీల్లో వ్యాపార ప్రకటన పన్ను వసూళ్లు పూర్తిగా పడకేశాయి. నిధుల కొరతతో అభివృద్ధి పనులకు బ్రేక్‌ పడుతున్నా.. ఉన్న ఆదాయ వనరులను కూడా మున్సిపాలిటీలు చేజేతులా వదిలేసుకుంటున్నాయి. ఏటా లక్షలాది రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే హోర్డింగులు, భారీ ఫ్లెక్సీలపై రెండేళ్లుగా పన్ను వసూలు చేయకపోవడం వెనుక అంతర్యం ఏమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ప్రమాణాలు గాలికి..

కేవలం ఆదాయం కోల్పోవడమే కాకుండా, ఈ హోర్డింగుల ఏర్పాటులో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. నిబంధనల ప్రకారం ఈ భారీ బోర్డులకు నిర్మాణ నాణ్యత ఉందో లేదో మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్టిఫై చేయాలి. కానీ, ఆ ఊసే ఎత్తడం లేదు. నాణ్యత లేని పాత ఇనుప పైపులు, తుప్పుపట్టిన రాడ్లతో ప్రధాన రహదారుల పక్కన, చౌరస్తాల్లో వీటిని నిలబెడుతున్నారు.

గాలిదుమారాలు వస్తే.. అంతే సంగతులు

ప్రస్తుతుం కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతకు ఈ నాణ్యత లేని భారీ హోర్డింగులు ఎప్పుడు ఊడి నెత్తిన పడతాయోనని రోడ్డుపై వెళ్లే వాహనదారులు, కాలినడకన వెళ్లే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు స్పందించి మున్సిపాలిటీల్లో వెలిసిన అక్రమ హోర్డింగులపై తక్షణమే తొలగించడంతో పాటు, బకాయి పన్నులను వసూలు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ పట్టణాల్లో వ్యాపారుల ఇష్టారాజ్యం

ఫ విచ్చలవిడిగా ఫ్లెక్సీలు, ఎల్‌ఈడీ స్క్రీన్‌ బోర్డుల ఏర్పాటు

ఫ మున్సిపల్‌ ఖజానాకు రూ.లక్షల్లో గండి

ఫ గాలి దుమారానికి కూలుతున్న బోర్డులు

ఫ ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం

Advertisement
 
Advertisement
Advertisement