భూసార పరీక్షల ఆధారంగా పంటలు
రైతులు ముఖ్యంగా పండ్లతోటలు సాగ చేసే రైతులు భూసార పరీక్షలు చేయించి పంటలు సాగు చేసుకోవాలి. లేకపోతే ఐదేళ్ల వరకు పెంచి కాపు కొచ్చే దశలోనే క్షీణించి రైతుకు పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉంది. భూసార పరీక్షలు ద్వారా తమ నేల ఏ పంటలకు అనుకూలమో నిర్ధారించుకోవాలి.
పెద్దవూర: రోహిణి కార్తె ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. వేసవి దుక్కులు, భూసార పరీక్షలు, నేల స్వభావాన్ని బట్టి పంటల సాగు ఇతర సాగు విధానాలపై రైతులు మెళకువలు, అవగాహన కలిగి ఉండాలని, వేసవి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మండల వ్యవసాయాధికారి సత్యనారాయణ పేర్కొంటున్నారు.
లోతు దుక్కులతో మేలు
లోతు దుక్కులు దున్నినప్పుడు భూమిలో ఉండే పురుగులు, తెగుళ్లను నశింపజేసే అవకాశం ఉంటుంది. భూమిలో దాగి ఉన్న లేదా నిద్రావస్ధలో ఉన్న పురుగులు, తెగుళ్లను కలుగ జేసే శిలీంద్రాలకు సూర్యరశ్మి సోకి నశిస్తాయి. దుక్కిలో బయట పడిన గ్రుడ్లు, ప్యూపాలను పక్షులు తిని నాశనం చేస్తాయి. కాబట్టి తొలకరిలో వేసే పైర్లకు వీటి తాకిడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. భూమిలో 9 అంగుళాల వరకు లోతు తగ్గకుండా దుక్కులు దున్నుకోవడం శ్రేయస్కరం.
కలుపు నివారణ
తుంగ, గరిక వంటి కలుపు మొక్కలు పొలాల్లో పెరిగి పంటలు నాశనం చేస్తాయి. కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి సత్తువ లేకుండా చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గడమేకాకుంగా భూమిలోని లోతైన పొరల్లో తేమ తగ్గుతుంది. తుంగ, గరికల వేర్లు దుబ్బుగా ఉండి నేలలో బాగా విస్తరించి ఉండటం వల్ల నివారణ కష్టం అవుతుంది. వేసవిలో దుక్కి బాగా దున్నినప్పుడు ఈ కలుపు వేర్లు , దుంపలు ఏరి వీటిని అరికట్టవచ్చు. వేసవిలో లోతుగా దున్ని తొలకరి వర్షాలకు గొర్రు, గుంటులతో దున్నినప్పుడు నేల బాగా గుల్ల బారుతుంది. పైర్ల వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. నేలకోతకు గురికాకుండా వాలుకు అడ్డంగా దున్నడం, వర్షపు నీటికి ప్రవాహానికి అడ్డంగా చిన్నపాటి మట్టి, రాతి కట్టడాలు ఏర్పాటు చేసుకోవాలి.
ఫ గత ఖరీఫ్‌కు సంబందించి పొలాల్లో ఉన్న ప్రత్తి, కంది, ఆముదం కట్టెలను తొలగించి పొలంలోనే కాల్చివేయాలి. పొలంలో గట్టిపొర ఏర్పడితే ఎర్రని ఇసుక మట్టిని తోలడం వల్ల భూమి బాగుపడుతుంది. వేసిన పంట నుంచి వేర్లు సులభంగా భూమిలోకి దిగుతాయి.
ఫ వేసవిలోనే సేంద్రియ ఎరువులు పంట పొలాలకు తరలించుకోవాలి. నీటి లభ్యత ఉన్న రైతులు పెంట కుప్పలపై నీటిని అడపదడపా చిలుకరించడం వల్ల తొందరగా ఎరువుగా మారుతుంది.
పంట మార్పిడి తప్పనిసరి
ఒకే భూమిలో ఏటా ఒకే పంటను కాకుండా వేర్వేరు పంటలు సాగు చేసుకుని పంట మార్పిడి చేసుకోవాలి. రైతులు ఒకే రకమైన పంటను వరుసగా సాగు చేస్తూ దిగుబడులు రాక నష్టపోతున్నారు. ఒకే పంటను ఏళ్ల తరబడి పండించడం వల్ల చీడపీడలకు ఎప్పుడూ ఆహారం సమద్దిగా లభించి అవి వద్ది చెందుతాయి. ఆ పంట వేర్లు వ్యాపించిన మేర భూమి పొరలు నిస్సారమవుతాయి. పంట మార్పిడి నేలసారాన్ని కాపాడుకోవడంతోపాటు తేమను సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చు.
● వివిధ రకాల వేరు వ్యవస్థలు కలిగి భిన్నంగా పెరిగే పైర్లను పంట మార్పిడి కోసం ఎంపిక చేసుకోవాలి. ప్రత్తి, ఆముదం, పొద్దు తిరుగుడు వంటి పైర్లు నేల లోపలి నుంచి పోషకాలు తీసుకుంటాయి.
● పోషకాలు ఎక్కువగా తీసుకునే నువ్వులు , పొద్దు తిరుగుడు వంటి పంటలకు భూమికి పోషకాలు సమకూర్చే అవసరాల పైర్లతో పంట మార్పిడి చేసుకోవాలి. ఇవి బెట్ట పరిస్ధితులను తట్టుకుంటాయి. వరుసగా పప్పుదాన్యాల పంటటు కాకుండా నూనె పంటలు సాగు చేయాలి.
● మిరుస, టమాట, వేరుశనగ, పంటలను ఆశించే లద్దె పురుగు నివారణకు జొన్న, సజ్జ, రాగి పంటల ఎర పంటలుగా వేసుకోవాలి. టమాట, మిరుప, పుచ్చ పంటల్లో బంతిని కూడ ఎర పంటగా కొన్ని సాళ్లు వేసుకుని తెగుళ్లు, ఆకుముడత నివారించవచ్చు.
● పంట మార్పిడి చేసేటప్పుడు అనుకూలమైన పంటలు ఎంచుకోకపోతే చీడపీడల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బెండ తర్వాత పత్తి వేయొద్దు. జొన్న సాగు చేసిన వెంటనే మిరుప వేయకూడదు. ఈ పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశించి నష్ట పరుస్తాయి.


