చిట్యాల: చిట్యాల మండలం బొంగొనిచెర్వు పరిధిలోని ‘నోష్ ల్యాబ్స్’ కెమికల్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగి 29 రోజులు కావస్తున్నా.. ఆస్పత్రి బెడ్‌లపై నరకం చూస్తున్న కార్మికుల గాయాలు ఇప్పటికీ పచ్చిగానే ఉన్నాయి. ఈ నెల 1న నోష్ ల్యాబ్స్‌లోని బ్లాక్–3లో రియాక్టర్ పేలుడు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ అపోలో ఆస్పత్రిలో వైద్య చికిత్స నిమిత్తం చేర్పించారు. ఆసుపత్రిలో చేరిన ఏడుగురిలో ముగ్గురు వైద్య చికిత్స అనంతరం డిశార్చి కాగా మరో నలుగురికి తీవ్ర గాయాలవటంతో నేటి వరకు వైద్య చికిత్స పొందుతున్నారు.
క్షతగాత్రులకు పరిహారం ఏదీ..
రియాక్టర్ పేలుడులో తీవ్రంగా గాయపడిన ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన డేవిడ్ కుజుర్, ఏపిలోని మలిచర్లకు చెందిన టి.లోకేష్, సంస్థాన్ నారయణపురానికి చెందిన హరిప్రసాద్, పంతంగికి చెందిన శంకర్‌లు గత ఇరవై ఎనిమిది రోజులుగా ఆస్పత్రిలో వైద్య చికత్స పొందుతున్నారు. పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ప్రమాదంలో లేచిన మంటలతో వీరికి చేతులకు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడుతో మృతి చెందిన బొడ్డు బాలకృష్ణ కుటుంబానికి నోష్ ల్యాబ్స్ పరిశ్రమ యాజమాన్యం పరిహారం అందజేసింది. ఇదే ప్రమాదంలో గాయపడిన వారికి మాత్రం పరిశ్రమ యాజమాన్యం వైద్య చికిత్సను అందజేస్తుంది. కానీ ఇప్పటి వరకు గాయపడిన కుటుంబాలకు పరిహారం విషయమై యాజమాన్యం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. పరిశ్రమలో గత రెండు నెలల కాలంలో వరుసగా రెండు సార్లు రియాక్టర్ పేలుడు జరగటం వల్ల పదుల సంఖ్యలో కార్మికులు గాయపడటం, ఒకరు మృతి చెందడంతో పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈమేరకు పరిశ్రమలో నిబంధనల మేరకు అనుమతులు, తగిన రక్షణ చర్యలు తీసుకునేంతరకు ఉత్పత్తి నిలిపివేశారు. దీంతో ఈ పరిశ్రమలో పనిచేస్తున్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న మూడు వందలకు పైగా కార్మికులు, ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది.
‘నోష్ ల్యాబ్స్’ పేలుడు ఘటనలో క్షతగాత్రులకు అందని పరిహారం
ఫ ప్రమాదం జరిగి 29 రోజులు
కావస్తున్నా ఆస్పత్రిలోనే చికిత్స
పొందుతున్న బాధితులు


