అర్వపల్లి: ఆ నిరుపేద మహిళకు అది కేవలం ఒక పక్షి కాదు. ఒక కుటుంబ సభ్యుడిలా చూసుకుంది. ఆ కోడి హఠాత్తుగా కళ్లముందే ప్రాణాలు విడుస్తుంటే ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఎవరో పెట్టిన విషానికి ఆ జీవి బలైందని తెలిసి, ఆవేదనతో చనిపోయిన తన కోడిపుంజును పట్టుకుని న్యాయం కోసం పోలీస్‌స్టేషన్ మెట్లెక్కింది. జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం గ్రామానికి చెందిన ఎల్లమళ్ల చంద్రకళ తన ఇంట్లో ఒక కోడిపుంజును పెంచుకుంటుంది. గురువారం ఉదయం వరకు చురుగ్గా తిరిగిన ఆ కోడిపుంజు హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఎవరో దానికి కావాలనే విషం పెట్టి చంపేశారని ఆమెకు అర్థమైంది. ‘నా కోడి నాకు కావాలి.. దాన్ని చంపినోళ్లను వదలొద్దు’ అంటూ రోదించింది. చనిపోయిన కోడిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. గ్రామంలో కొంతమందిపై తనకు ఉన్న అనుమానాలను పోలీసులకు వివరించింది.
వడదెబ్బతో వ్యక్తి మృతి
మిర్యాలగూడ టౌన్ : వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడు గ్రామంలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్‌ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన కాస నరసయ్య(49) అదే గ్రామానికి చెందిన బోలిశెట్టి రాము వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. దీంతో మైనం సుధాకర్ పొలంలో ట్రాక్టర్ ద్వారా మట్టిని ఒక చోట నుంచి మరో చోటుకు తరలించి మధ్యాహ్నం 3గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఎండ తీవ్రంగా ఉందని, ప్రాణం బాగాలేదని ఆయన అంటుండగానే నరసయ్య అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తరలిస్తుండగా ఉట్లపల్లి గ్రామ శివారులోకి రాగానే మృతి చెందాడు. మృతుడి భార్య రమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.
ఫ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన మహిళ


