బైక్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

బైక్‌ దగ్ధం

May 29 2026 8:10 AM | Updated on May 29 2026 8:10 AM

మోతె: ఓ శుభకార్యానికి వచ్చి ఓ వ్యక్తి తన బైక్‌ను రోడ్డుపక్కన నిలపగా వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చి పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మోతె మండలంలోని రావిపహాడ్‌ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి ఆలకుంట్ల రాములు శుభకార్యం నిమిత్తం బైక్‌పై రావిపహాడ్‌ గ్రామానికి వచ్చాడు. తన ద్విచక్రవాహనాన్ని పక్కకు ఆపిన కొద్దిసేపటికే బైక్‌ ప్లగ్‌ నుంచి పొగ రావడంతోపాటు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఎండ తీవ్రతకు బైక్‌ ఇంజన్‌ వేడెక్కి వాహనం దగ్ధమైనట్లు గ్రామస్తులు భావిస్తున్నారు.

తుమ్మలపెన్‌పహాడ్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌..

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహాడ్‌ గ్రామంలో గురువారం సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ దగ్ధమైంది. విద్యుత్తు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌పై లోడింగ్‌తో పాటు ఎండ తీవ్రతకు కాలిపోయినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

మేక కడుపులో

మూడు కిలోల ప్లాస్టిక్‌ కవర్లు

కోదాడరూరల్‌ : కోదాడ పశువైద్యాశాలలో గురువారం మేక కడుపులో ఉండలు కట్టిన మూడు కిలోల ప్లాస్టిక్‌ కవర్‌లను కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పెంటయ్య బయటకు తీశారు. హుజూర్‌నగర్‌కు చెందిన ఉపేంద్రమ్మకు చెందిన మేక కొన్ని రోజులుగా మేత మేయకుండా ఇబ్బంది పడుతుండడంతో ఆ మేకను కోదాడకు తీసుకరాగా పరీక్షించిన డాక్టర్‌ పెంటయ్య.. మేక కడుపులో ప్లాస్టిక్‌ కవర్‌లు ఉన్నట్లు గుర్తించి శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీశారు.

సామూహిక పోరాటాలతోనే తెలంగాణ సాకారం

మిర్యాలగూడ టౌన్‌ : సబ్బండ వర్గాల సామూహిక ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని సామాజికవేత్త, తొలి, మలిదశ ఉద్యమకారుడు డాక్టర్‌ జాడీ రాజు అన్నారు. గురువారం మిర్యాలగూడలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ భవనంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన నాయకులను గుర్తించి, గౌరవంగా సత్కరించాల్సిన అవసరం ఉందన్నారు. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులను సత్కరించేందుకు సిద్ధం కావడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమ నేత మాళోతు దశరథనాయక్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, వివిధ సంఘాల నాయకులు మాడుగుల శ్రీనివాస్‌, ధీరావత్‌ లింగానాయక్‌, క్రాంతికుమార్‌, వెంకటేశ్వర్లు, మురళియాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement