టాయిలెట్‌లో పూర్తిగా సెన్సార్ ఆధారిత వ్యవస్థను వినియోగిస్తున్నారు. వినియోగించే వారు చేతితో తాకాల్సిన అవసరం లేకుండానే పనిచేసే ఫ్లషింగ్ సిస్టమ్, సెన్సార్ వాటర్ ట్యాప్‌లను ఇందులో అమర్చనున్నారు.
భువనగిరిటౌన్ : పట్టణ ప్రజలకు సురక్షితమైన, గౌరవప్రదమైన, అధునాతన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద భువనగిరి పట్టణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆకాంక్షాత్మక శౌచాలయం ప్రాజెక్టు పేరుతో నిర్మించనున్నారు. 10 సీట్ల (నాప్స్) సామర్థ్యంతో నిర్మించనున్న ఈ స్మార్ట్ పబ్లిక్ టాయిలెట్‌కు స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద రూ.32.50 లక్షల నిధులు మంజూరు చేశారు. సాధారణ పబ్లిక్ టాయిలెట్లకు భిన్నంగా, కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నారు. ప్రజలకు అందుబాటు ఉండే స్థలం పరిశీలించి త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మహిళల ఆరోగ్యానికి పెద్దపీట
మహిళల రక్షణ, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టులో ప్రత్యేక వసతులను కల్పిస్తున్నారు. మహిళా విభాగంలో శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ మెషీన్లతోపాటు, ఉపయోగించిన నాప్‌కిన్లను సురక్షితంగా పారేసేందుకు అధునాతన డిస్పోజల్ యూనిట్లను అమర్చనున్నారు. పురుషులు, మహిళలకు విడివిడిగా ప్రైవసీ సౌకర్యం ఉండనుంది.
దివ్యాంగులు, పిల్లలకు అనుకూలం
దివ్యాంగులు, చిన్న పిల్లలు సైతం ఎవరి సహాయం లేకుండా సులభంగా టాయిలెట్స్‌ను ఉపయోగించుకునేలా ప్రత్యేక ర్యాంప్‌లు, గ్రాబ్ బార్స్ కలిగిన సీట్లను డిజైన్ చేశారు. లింగ భేదం లేకుండా ఎవరైనా ఉపయోగించుకునేలా జెండర్ న్యూట్రల్ టాయిలెట్ ఆప్షన్ కూడా ఇందులో ఉండనుంది.
పర్యావరణ హితం
విద్యుత్ ఆదా చేసే స్మార్ట్ లైటింగ్, సహజసిద్ధమైన గాలి, వెలుతురు వచ్చేలా మెరుగైన వెంటిలేషన్ వ్యవస్థను ఈ పబ్లిక్ టాయిలెట్స్‌లో ఏర్పాటు చేస్తారు. నీటిని పొదుపు చేసే ఎకోఫ్రెండ్లీ సాంకేతికతను, కరెంట్ పోయినా ఇబ్బంది లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఇన్వర్టర్ వసతి ఉంటుంది. నిరంతరం నిపుణులైన సిబ్బందితో క్లీనింగ్ చేయిస్తూ, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించనున్నారు. పట్టణ ప్రాంతాల్లోని సాధారణ ప్రజలకు, ముఖ్యంగా మార్కెట్లు, రద్దీ ప్రాంతాలకు వచ్చే మహిళలు, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఫ భువనగిరిలో సెన్సార్ ఆధారిత పరిజ్ఞానంతో నిర్మించేందుకు ప్రణాళిక
ఫ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద రూ. 32.50 లక్షల నిధులు మంజూరు
ఫ మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడమే లక్ష్యంగా కార్యాచరణ
ఫ త్వరలో పనులు ప్రారంభం


