ఫ అఖిలపక్షాలు, బాధితుల ధర్నా
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని రోడ్డు విస్తరణ పనులు 60ఫీట్లు వద్దని 30 ఫీట్లకు కుందించాలని అఖిలపక్షాల నేతలు, బాధితులు ఆందోళనకు దిగారు. నల్లగొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా వరకు (బహార్‌పేట వీధి) ప్రతిపాదించిన 60 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ విస్తరణ వల్ల పేద కుటుంబాలు రోడ్డున పడుతాయని బుధవారం ఉదయం భువనగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట బాధితులతో కలిసి అఖిలపక్ష నాయకులు, ప్రజలు ధర్నా చేపట్టారు. బాధితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, పూర్తిస్థాయి ఆర్థిక ప్యాకేజీ, నష్టపరిహారం అందించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సమయంలో అధికార పార్టీ కౌన్సిలర్లు వచ్చి ఆఫీస్‌లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు, నాయకుల మధ్యతోపులాట జరిగింది. ఆ తర్వాత పోలీసులు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లను లోనికి పంపిచారు. అఖిల పక్ష నాయకులను నిలువరించారు. ఆ సమయంలో కార్యాలయం తలుపులు మూసేశారు. తోపులాటలో మహిళలకు స్వల్పగాయాలయ్యి. బహార్‌పేట రోడ్డు విస్తరణ వల్ల ఇళ్లు కోల్పోయే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
127 ఆస్తులకు నష్టం
60ఫీట్ల రోడ్డు విస్తరణకు సంబంధించి అధికారులు నష్టం అంచనా వేశారు. దీని వల్ల మొత్తం 127 గృహాలు, వ్యాపార సంస్థలకు నష్టం వాటిల్లనుంది. ఇందులో 22 గృహాలు పునాదులతో సహా పూర్తిగా నేలమట్టం కానుండగా, మరో 105 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిననున్నాయి. బాధితుల్లో అత్యధికులు 30 నుంచి 60 గజాల లోపు ఇళ్లు ఉన్నవారే.


